Family Members Election Campaign In Telangana :రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న పలువురు సీనియర్ నేతల కుమారులు తొలిసారి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఎండను కూడా లెక్క చేయకుండా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. తొలిసారి ఎన్నికల బరిలో దిగినందున ఓటమి పాలైతే వారి రాజకీయ ప్రస్థానంపై నీలినీడలు పడే ప్రమాదముందని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ నుంచి ఆశించకుండా సొంతంగా పెద్దఎత్తున డబ్బులను సైతం ఖర్చు చేస్తున్నారు. గ్రామస్థాయి నుంచి నాయకులను కలుస్తూ గెలుపుకు సహాయపడాలని కోరుతున్నారు.
Loksabha Election Campaign In Telangana: నల్గొండలో సీనియర్ నేత అయిన జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డికి, పెద్దపల్లిలో ఎమ్మెల్యే వివేక్ కొడుకు గడ్డం వంశీకృష్ణకు వరంగల్‌లో ఎమ్మెల్యే కడియం కూతురు కావ్యకు, మల్కాజిగిరిలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి సతీమణి సునీతకు కాంగ్రెస్ లోక్‌సభ టికెట్లు ఇచ్చింది. నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్కు చెందిన సిటింగ్ ఎంపీ రాములు బీజేపీలో చేరి తన కొడుకు భరత్‌కు లోక్‌సభ టికెట్ ఇప్పించుకున్నారు. ఇదే నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవి కూడా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సోదరుడు.
వీరిలో ఎక్కువ మంది అధికార కాంగ్రెస్‌కు చెందిన వారే కావడంతో పాటు మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో నిలుస్తున్నందున ఈ స్థానాలపై పార్టీ సైతం ప్రత్యేక దృష్టి పెట్టింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి ఆరోగ్య కారణాలతో కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో తిరగడం లేదు. ఈ ఎన్నికల్లో మాత్రం ఎండలను కూడా లెక్క చేయకుండా కుమారుడి విజయం కోసం నల్గొండ కేంద్రంగా ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. బుధవారం సీపీఐ, సీపీఎం కార్యాలయాలకు సైతం వెళ్లి తన కుమారుడి విజయానికి మద్దతివ్వాలని వారిని కోరారు.
తామే అండదండలుగా :మరో సీనియర్ నేత వివేక్ తన కుమారుడి గెలుపు కోసం పగలనకా రాత్రనకా శ్రమిస్తున్నారు. వివేక్ సోదరుడు వినోద్ కూడా ఎమ్మెల్యే కావడంతో అన్నదమ్ములిద్దరూ తమ వారసుడి గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. ఇక సీనియర్ నేత కడియం శ్రీహరి వైద్యురాలైన తన కూతురు కావ్యను రాజకీయాల్లో వేలుపట్టి నడిపిస్తున్నారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల ముందు వరకూ బీఆర్ఎస్లో ఉండి, ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరినందున ఈ పార్టీ నేతలందరినీ కలుపుకొని పోవడానికి గట్టిగా కృషి చేస్తున్నారు. మల్కాజిగిరిలో పోటీ చేస్తున్న సునీతారెడ్డి రంగారెడ్డి జడ్పీ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. దీంతో ఆమెకు ప్రత్యక్ష రాజకీయాల్లో అనుభవముంది. అయినా ఆమె భర్త పట్నం మహేందర్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తూ నేతలను కలుస్తూ భార్య విజయం కోసం కష్టపడుతున్నారు.