Theft Gangs In Hyderabad : హైదరాబాద్‌లో దృష్టి మరల్చి మోసాలకు పాల్పడుతున్న ముఠాలు రెచ్చిపోతున్నాయి. బస్టాండ్లు, బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల వద్ద కాపుగాసి నగదు కాజేస్తున్నారు. మరికొందరు మెట్రో రైళ్లు, సిటీ బస్సులు, దుకాణాల్లోకి చేరి అందినకాడికి దోచుకుంటున్నారు. హైదరాబాద్‌తో పాటు ఏపీ, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు గ్యాంగులు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువకుడు కేపీహెచ్‌బీ హాస్టల్‌లో ఉంటున్నాడు. గత నెల 23న మెహదీపట్నంలో ఆర్టీసీ బస్సు ఎక్కి కిటికీ పక్కన కూర్చున్నాడు. అతని పక్కన కూర్చొన్న వ్యక్తి అకస్మాత్తుగా యువకుడి మీద గుట్కా ఉమ్మాడు. అదే బస్సులో ఉన్న ముగ్గురు వ్యక్తులు హడావుడి చేశారు. జీవీకే మాల్ వద్ద దిగిపోయిన అతను గమనించగా, మెడలో రూ.30 వేల గొలుసు మాయమైనట్టు తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మాయగాళ్ల లెక్కే వేరబ్బా
- అంతర్రాష్ట్ర ముఠాలు తమదైన శైలిలో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్నారు. బీదర్‌కు చెందిన ఇరానీ ముఠాలు సూడో పోలీస్ వేషంలో మోసగిస్తారు. బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల వద్దకు వచ్చిన వారిని మాటలతో బురిడీ కొట్టిస్తారు. బ్యాంకు లావాదేవీలపై ఫిర్యాదు వచ్చిందంటూ డబ్బులు లెక్కిస్తామని తీసుకుంటారు. వాటిని పరిశీలించే క్రమంలోనే కొన్ని నోట్లను కొట్టేస్తారు.
- యూపీ ముఠా సభ్యులు కార్లను లక్ష్యంగా చేసుకున్నారు. కారుకు రెండువైపులా నిలబడి డ్రైవింగ్ సీట్లో ఉన్న వైపు చేరిన వ్యక్తి టైర్ పంక్చర్ అయిందంటాడు. అదే సమయంలో అటువైపు ఉన్న వ్యక్తి డోర్ కొడతాడు. గ్లాసులు కిందకు దించగానే సీట్లో ఉన్న ల్యాప్‌ట్యాప్‌లు, సెల్‌ఫోన్లు కొట్టేసి మాయమవుతారు. 4 నుంచి 5 మంది ఉండే ఈ ముఠా 40 నుంచి 50 చరవాణులు కొట్టేస్తే గానీ ఇక్కడ నుంచి వెళ్లిపోరని పోలీసులు తెలుపుతున్నారు.
- తమిళనాడు కేటుగాళ్లు బ్యాంకుల వద్దకు వెళ్తారు. రూ.లక్షల్లో నగదు తీసుకుని వెళ్లేవారిని వెంబడించి రూ.100 నోట్లు కిందపడేసి మీవేనని చెబుతారు. ఈ క్రమంలో బాధితుల చేతిలోని నగదు సంచులను తీసుకొని పారిపోతారు.
- నగరంలో ముఠాగా ఏర్పడి ఆర్టీసీ సిటీ బస్సులోకి చేరతారు. ప్రయాణికుల పక్కనే కూర్చొని బంగారు నగలు, ఆభరణాలు చోరీ చేస్తారు.