Police Focus on YS Avinash Reddy PA : వైఎస్ఆర్ జిల్లా పులివెందుల పోలీస్ స్టేషన్లో నమోదైన అట్రాసిటీ కేసులో అనుమానితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి కోసం గాలింపు చేపట్టారు. ఈ నెల 8న వైఎస్సార్సీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డితోపాటు సజ్జల భార్గవ్‌రెడ్డి, అర్జున్‌రెడ్డిపై అట్రాసిటీ కేసులు నమోదైన విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ కేసులో పులివెందుల పోలీసులు వర్రా రవీందర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. వైఎస్ షర్మిల, వైఎస్ సునీత, వైఎస్ విజయమ్మపైన వర్రా రవీందర్‌రెడ్డి అసభ్యకరమైన పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. అతను ఇచ్చిన వాంగ్మూలంలో వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని పేరును ప్రస్తావించాడు. అవినాష్ రెడ్డి పీఏ ఇచ్చిన కంటెంట్‌ని తాను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశానని వర్రా పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు రాఘవరెడ్డి కోసం పులివెందుల, లింగాల మండలాల్లో గాలిస్తున్నారు. అతడి స్వగ్రామం అంబకపల్లెలో పోలీసులు నిఘా పెట్టారు.