Janwada Farmhouse Party Case : హైదరాబాద్ జన్వాడలోని ఫామ్‌హౌస్‌పై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. జన్వాడ రిజర్వ్ కాలనీలో ఉన్న రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి పార్టీ నిర్వహించారు. భారీ శబ్దాలతో పార్టీ నిర్వహిస్తున్నట్లుగా వచ్చిన సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో పాల్గొన్న 24 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. అందులో విజయ్ మద్దూరి అనే వ్యక్తి కొకైన్ తీసుకున్నట్లు పరీక్షలో తేలడంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలోనే తనిఖీల్లో విదేశీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో భాగంగా ఎక్సైజ్ యాక్ట్ సెక్షన్ 34 కింద మరో కేసును నమోదు చేశారు. మద్యం పార్టీలో మొత్తం 35 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. పాల్గొన్న వారిలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఫామ్‌హౌజ్ యజమాని రాజ్ పాకాలను కేటీఆర్ బావమరిదిగా నిర్ధారించారు. ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా మద్యం పార్టీ చేశారని గుర్తించారు. క్యాసినో పరికరాలు సైతం స్వాధీనం చేసుకోవడంతో క్యాసినో నిర్వహించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫామ్‌హౌస్‌లో ప్లేయింగ్ కార్డ్స్, ప్లాస్టిక్ కైన్స్ వంటివి కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 30 ఎకరాల్లో రాజ్ పాకాల ఫామ్‌హౌస్ విస్తరించి ఉంది.