Hookah Centers in Hyderabad :హైదరాబాద్లో హుక్కా కేంద్రాల దందా ఆగడం లేదు. తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించినా అనేక ప్రాంతాల్లో గుట్టుగా ఈ దందా కొనసాగుతోంది. కేఫేలు, పార్లర్లు, రెస్టారెంట్ల పేరుతో అపార్టుమెంట్లు, కాలనీల్లో అడ్డగోలుగా వీటిని నడిపిస్తున్నారు. నేరగాళ్లు తమ గుట్టు బయటపడకుండా తెలిసిన వ్యక్తుల్ని మాత్రమే అనుమతిస్తున్నారు.
ముఖ్యంగా పాతబస్తీ, పరిసర ప్రాంతాల్లో ఈ దందా ఎక్కువగా నడుస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో హుక్కా కేంద్రాల్ని నిషేధిస్తూ చట్టం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా పోలీసు తనిఖీల్లో తరచూ హుక్కా దందా వెలుగు చూస్తుంది. ఈ నెల 4న మహేశ్వరం ఎస్వోటీ పోలీసులు బాలాపూర్ ఠాణా పరిధిలోని బర్మాకాలనీలో తనిఖీలు చేసినప్పుడు ఓ హుక్కా కేంద్రాన్ని గుర్తించారు.
పరిచయస్థులకే అనుమతి : గతంలో హైదరాబాద్లోనే ఎక్కువగా హుక్కా కేంద్రాలుండేవి. పొగాకు ఉత్పత్తులు వాడొద్దని నిబంధనలున్నా పట్టించుకునేవారు కాదు. మైనర్లను అనుమతించడంతో పాటు అనైతిక కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తరచూ పోలీసుల తనిఖీల్లో బయటపడేది. పొగాకు ఉత్పత్తులతో పాటు మద్యం, గంజాయి, డ్రగ్స్ వినియోగం ఉంటుందని గుర్తించారు.
వీటితో యువత చెడిపోతున్నారని నివేదించడంతో ప్రభుత్వం నిషేధం విధించింది. అయినా దందా ఆగడంలేదు. గుట్టుగా హుక్కా కేంద్రాలను కొనసాగిస్తున్నారు. అపార్టుమెంట్లు, కాలనీల్లోని ఇళ్లల్లో నిర్వహిస్తున్నారు. తెలిసిన వ్యక్తులను మాత్రమే అనుమతిస్తూ దందా చేస్తున్నారు. ఏ మాత్రం అనుమానమొచ్చినా వెంటనే అడ్డా మార్చేస్తున్నారు.