Police Notices to Media Personnel: బాపట్ల జిల్లా మేదరమెట్లలో నేడు వైసీపీ నిర్వహించనున్న ‘సిద్ధం’ సభ కవరేజీకి వెళ్లొద్దంటూ పలువురు మీడియా సిబ్బందికి బాపట్ల జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యాయి. నోటీసులు తీసుకోవాలంటూ మీడియా ప్రతినిధులకు స్థానిక పోలీసులు ఫోన్లు చేస్తున్నారు. ఎస్పీ కార్యాలయం నుంచి 149 నోటీసులు వచ్చాయని వారు చెబుతున్నారు. సభ కవరేజీకి వెళ్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మీడియా సిబ్బందితో పాటు యూటీఎఫ్ నేతలు, టీడీపీ నేతలు, కార్యకర్తలకు నోటీసులు జారీ చేశారు. కవరేజీకి వెళ్లొద్దంటూ నోటీసులు ఇవ్వడంపై మీడియా ప్రతినిధులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల జిల్లాలోని సభను అడ్డుకుంటారంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అదే విధంగా బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం తూర్పుపాలెం రైతులకు సైతం నోటీసులు ఇచ్చారు. సిద్ధం సభ వైపు వెళ్లొద్దంటూ నలుగురు రైతులకు పోలీసుల నోటీసులను జారీ చేశారు.
మరోవైపు సిద్ధం సభకు వైసీపీ నాయకులు భారీగా ఆర్టీసీ బస్సులు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా 3 వేలకు ఆర్టీసీ బస్సులు వైసీపీ సిద్ధం సభకు తరలించారు. దీంతో బస్సులు లేక దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా ప్రకాశం జిల్లా కనిగిరిలో ఇతర డిపోలకు చెందిన ఆర్టీసీ ఉద్యోగుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు.
'సిద్ధం' బాటలో ఆర్టీసీ బస్సులు - ప్రయాణికుల అష్టకష్టాలు
బాపట్ల జిల్లా మేదరమెట్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు నిర్వహించబోయే సిద్ధం ముగింపు సభ నిమిత్తం ప్రజలను తరలించేందుకు కనిగిరి డిపోకు చెందిన బస్సులను ఇతర జిల్లాలకు పంపించగా ఇతర జిల్లాలకు చెందిన బస్సులను కనిగిరికి కేటాయించారు. అందులో భాగంగా కనిగిరి ప్రాంతానికి ఇతర జిల్లాలకు చెందిన పీలేరు, రాజంపేట డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు శనివారం రాత్రే చేరుకున్నారు.
బస్సులను ప్రధాన రహదారికి ఇరువైపులా, కనిగిరి ఆర్టీసీ డిపోలో ఉంచి జనాల కోసం రాత్రి నుంచి ఎదురు చూస్తున్నప్పటికీ ఎవరు రాలేదు. అయితే బస్సుల డ్రైవర్లు మాత్రం రాత్రి నుంచి తినేందుకు సరైన ఆహారం లేక తాగేందుకు నీళ్లు లేక దోమల బెడదతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆరోపిస్తున్నారు.
సిద్ధం సభ నిమిత్తం పీలేరు, రాజంపేట డిపోలకు చెందిన బస్సులను కనిగిరి నుంచి ప్రజలను తరలించేందుకు కేటాయించారు. ప్రజలను తరలించేందుకు కనిగిరికి పీలేరు, రాజంపేట డిపోలకు చెందిన సుమారు 30 బస్సులు రాత్రి 8 గంటలకు కనిగిరికి చేరుకున్నాయి. అయితే సిద్ధం సభకు వెళ్లేందుకు ఎవరు రావడం లేదని, మరికొంత సమయం వరకు చూసి తమ డిపోలకు బస్సులను తీసుకువెళతామని డ్రైవర్లు అంటున్నారు. సిద్ధం సభకు భారీగా తరలించడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారు.
సిద్ధం సభకు 2 వేల 500 బస్సులు! - ఇంటర్ విద్యార్థుల పరిస్థితి ఏంటి - ప్రజలు ఎలా పోయినా పర్లేదా?