Kukatpally Woman Gang Rape Case Update : రాజమహేంద్రవరానికి చెందిన ఓ మహిళ తన భర్త మరణించడంతో కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి ఒంటరి ఉంటోంది. మూసాపేట వై జంక్షన్‌లోని ఓ వాహన షోరూంలో స్వీపర్‌గా పనిచేస్తూ, ఖాళీ సమయాల్లో చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో బిహార్‌కు చెందిన నితీశ్‌కుమార్ దేవ్‌తో పాటు ఓ మైనర్ సంగారెడ్డిలోని ఒక బార్ అండ్ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నారు. చెడు అలవాట్లకు బానిసైన వీరిద్దరూ పని పూర్తయ్యాక నిత్యం మద్యం సేవించేవారు. ఈ నెల 20వ తేదీన తమ స్నేహితుడిని బిహార్‌కు పంపించేందుకు ద్విచక్ర వాహనంపై నగరంలోని ప్యారడైజ్ దగ్గరికి వచ్చి తిరిగి వేళ్లే క్రమంలో ఓ టీ స్టాల్ దగ్గర ఆగి టీ తాగారు.
అదే సమయంలో అక్కడ ఓ మహిళ ఒంటరిగా కనిపించింది. సైగలతో ఆమెను వేధించిన నితీశ్ కుమార్... కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. మైనర్ బాలుడిని వెంటపెట్టుకుని ఆమెను కొంత దూరం అనుసరిస్తూ వెళ్లారు. ఓ నిర్మానుష్య ప్రాంతంలోని భవనం వద్దకు వెళ్లగానే అడ్డుకున్నారు. అనంతరం సెల్లార్‌లో ఆమెపై ఇద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారు. వీరి నుంచి తప్పించుకునే క్రమంలో మైనర్ బాలుడు ఆమె కాళ్లను అదిమిపట్టాడు. నితీశ్ కుమార్ ఆమె తలను బలంగా నేలకు కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై కొద్దిసేపటికి మరణించింది.
"సీసీ కెమెరాల ద్వారా వెరిఫై చేయగా ఒక బైక్ మీద ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆమెను అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్లు గుర్తించాం. నాలుగు టీంలుగా విభజించి డీసీపీ ఆదేశాలతో సీసీ కెమెరాలను చెక్ చేయడం జరిగింది. ఇలా ఆ బైక్‌ను వెంబడించి దాని అసలైన ఓనర్‌ను పట్టుకోవడం జరిగింది. అతని ద్వారా ఎవరికి అమ్మారో వారి వివరాలను సేకరించాం. చివరికి సంగారెడ్డిలో వీరిని అదుపులోకి తీసుకున్నాం. విచారించిన తర్వాత నేరం ఒప్పుకున్నారు. వారికి రిమాండ్ విధించి జైలుకు పంపించాం."- శ్రీనివాసరావు, ఏసీపీ కూకట్‌పల్లి