Police Confirm Victim Identity in Body Parcel Case in West Godavari District : పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర కలకలం రేపిన చెక్కపెట్టెలో మృతదేహం పార్శిల్ కేసు పోలీసు యంత్రాంగానికి సవాలు విసురుతోంది. తాజాగా పోలీసులు మృతుడి వివరాలు తెలుసుకున్నారు. అయితే హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే ప్రశ్నలకు జవాబు ఇంకా దొరకలేదు. మరోవైపు కేసులో అనుమానితుడిగా భావిస్తున్న శ్రీధర్ వర్మ నేర చరిత్ర తవ్వితీసిన పోలీసులు అతని జాడ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. శ్రీధర్ వర్మ దొరికితేనే ఈ కేసులోని చిక్కుముడులు వీడే అవకాశం ఉంది.
యావత్ ఆంధ్రావనిని ఉలికిపాటుకు గురిచేసిన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి మండలం యడగండి గ్రామానికి చెక్కపెట్టెలో డెడ్ బాడీ డెలివరీ కేసు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గత నాలుగు రోజులుగా ముప్పుతిప్పలు పెడుతున్న ఈ కేసులో పోలీసులు సోమవారం కీలక సమాచారాన్ని సేకరించారు. ఇప్పటికే భీమవరం ప్రభుత్వ ఆస్పత్రిలో శవపరీక్ష చేసి హత్యగా తేల్చిన పోలీసులు మృతుడు కాళ్ల మండలం గాంధీనగరానికి చెందిన బర్రె పర్లయ్యగా గుర్తించారు. అయితే అతని కుటుంబ సభ్యుల డీఎన్ఏతో పరీక్షించాక కానీ పూర్తిగా నిర్ధారించలేమని చెబుతున్నారు.
పర్లయ్యకు ఇద్దరు కుమారులున్నారు. భార్యతో సత్సంబంధాలు లేకపోవడంతో ఇద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో పర్లయ్య దొరికిన పని చేస్తూ పెట్టింది తింటూ చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతుంటాడని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పర్లయ్య వారం క్రితం ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న శ్రీధర్ వర్మ వద్ద పనిచేసినట్లు తెలుస్తోంది. శ్రీధర్ వర్మ గాంధీనగరానికి వచ్చి వెళ్లిన కారును సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించిన ఛాయా చిత్రాలను విడుదల చేశారు.