Police Busted High Tech Prostitution Racket : ఒంటరితనం నుంచి బయటపడేందుకు, సరదాగా మాట్లాడేందుకు సరైన భాగస్వామిని ఎంపిక చేసుకోవచ్చంటూ అంతర్జాలంలో ప్రకటనలిస్తారు. ఆకర్షితులైన వారిని వెబ్సైట్లు, యాప్‌ల్లో మెంబర్షిప్ తీసుకోవాలని షరతు విధిస్తారు. సభ్యులుగా చేరేందుకు ఒక్కొకరి వద్ద రూ.5-10 వేల వరకూ వసూలు చేస్తారు. సభ్యత్వం తీసుకున్నాక వెబ్సైట్లు, యాప్‌ల్లోని యువతులు, మహిళలతో ఛాటింగ్ చేసేందుకు అవకాశం కల్పిస్తారు.
దీనికి విపరీతమైన డిమాండ్ పెరగటంతో భాగ్యనగరంలో వ్యభిచార గృహాలు నిర్వహించే కొందరు దళారులు ఈ తరహా యాప్‌ల ద్వారా విటులను ఆకట్టుకుంటున్నారు. బంగ్లాదేశ్, శ్రీలంక, థాయ్‌లాండ్, సింగపూర్, నైజీరియా దేశాల నుంచి యువతులను జాబ్స్, పర్యాటక వీసాలతో నగరానికి చేరవేస్తున్నారు. మసాజ్ సెంటర్లు, హోటళ్లు, నివాస ప్రాంతాల్లో గదులు అద్దెకు తీసుకొని అక్కడ వీరితో చీకటి కార్యకలాపాలు సాగిస్తున్నట్టు నగరానికి చెందిన పోలీసు అధికారి తెలిపారు.
పర్యాటక వీసాలతో నగరానికి అక్రమ రవాణా :గచ్చిబౌలిలో ఇటీవల పట్టుబడిన 17 మంది యువతుల్లో కొందరి పాస్‌పోర్టు గడువు ముగిసినట్టు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. వీరిని ఒకే ప్రాంతంలో ఉంచితే పట్టుబడే అవకాశం ఉండటంతో తరచూ వేర్వేరు నగరాలకు తిప్పుతూ పోలీసులకు చిక్కకుండా అక్రమార్కులు జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం. కాగా యాప్‌ల వేదికగా అక్కడి సభ్యులకు విదేశీ యువతులను పరిచయం చేస్తున్నారు.
అమ్మాయిలు నగ్నంగా మారి వీడియోకాల్‌లో మాట్లేడేందుకు అవకాశం కల్పిస్తున్నారు. వారితో గడిపేందుకు ఆసక్తి చూపిన విటులకు ఆ ప్రాంతాల్లోని ఏజెంట్ల ఫోన్ నెంబర్లు ఇస్తున్నారు. పోలీసులు గుర్తించకుండా కేవలం యాప్‌లు, వెబ్సైట్ల ద్వారానే మంతనాలు సాగించటం ముఠాల ప్రత్యేకత. విటుల నుంచి భారీగా సొమ్ము కాజేసే నిర్వాహకులు, ఒక్కో యువతికి రోజుకు రూ.500-1000లోపు కమీషన్ ఇస్తున్నట్టు సమాచారం.