ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిక్కటి పాలు, ధర తక్కువ - మీరూ ఆ బ్రాండ్ల పాలు తాగుతున్నారా? - పేరు బాగుందని కొంటే అంతే! - FAKE MILK PRODUCTS

హైదరాబాద్​లో కల్తీపాల గుట్టురట్టు - డబ్బు కోసం ప్రాణాలతో చెలగాటమాడే ప్రయోగాలు

police_attacks_on_adulterated_milk_unit-_in_peerzadiguda_hyderabad
police_attacks_on_adulterated_milk_unit-_in_peerzadiguda_hyderabad (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 17, 2024, 1:16 PM IST

Police Attacks on Adulterated Milk Unit in Peerzadiguda Hyderabad :ఉదయం లేవగానే పసిపిల్లలు మొదలుకుని పెద్దవాళ్ల వరకు ఎవరైనా ప్రత్యేకంగానో పరోక్షంగానో పాలు గానీ వాటి అనుసంధాన ఉత్పత్తులను గానీ తీసుకోవడం సర్వసాధారణం. 'పాలు చాలా బలం, రోజుకు రెండు గ్లాసుల పాలు తాగితే నీకు నచ్చిన బొమ్మలు కొనిస్తా' అంటూ పిల్లులకు నచ్చజప్పి, బుజ్జగించి పాలు తాగిస్తారంతా. అది మంచిదే.. కానీ.. ఏ పాలు తాగిస్తున్నారు? చిక్కగా, తెల్లగా ఉన్నాయి, ప్యాకెట్​ కూడా బాగుందని తక్కువ ధరకు కొన్నవేనా? ‘స్వచ్ఛ భారత్, మేకిన్‌ ఇండియా’ లోగోలు ఉన్నాయా? ప్రముఖ బ్యాండ్లతో పోలిస్తే చాలా చవకగా దొరుకుతున్నాయని కొంటున్నారా? ఈ బలహీనతలనే క్యాష్​ చేసుకుంటున్నరు కొందరు స్వార్థపరులు.

ఈ పాలు పసిబిడ్డలు తాగుతారని తెలిసి కూడా స్వార్థంగా విక్రయిస్తూ పాపాలకు ఒడిగడుతున్నారు. రసాయనాలు, ఇతర పదార్థాలతో నకిలీ పాలు తయారుచేస్తూ మోసాలకు తెగబడుతున్నారు. హైదరాబాద్‌ శివారులోని మేడిపల్లి పీర్జాదిగూడలో ఎస్‌వోటీ పోలీసులు తాజాగా ఓ తయారీ కేంద్రంలో తనిఖీలు నిర్వహించడంతో ఎంతో కాలంగా గుట్టుగా సాగుతున్న నకిలీ బాగోతం బయటపడింది. వీరు‘వాసన కోసం కొంచెం పాల పొడి వాడి, దానికి ఎసిడిక్‌ యాసిడ్, గ్లూకోజ్‌ ద్రావణం, చిరోటి రవ్వ, పామాయిల్, వనస్పతి’ వంటి పదార్థాలు కలిపి రోజుకు 5 వేల లీటర్ల నకిలీ పాలు తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలడం అందోళనకర పరిణామం.

మీరు తాగేవి స్వచ్ఛమైన పాలేనా.. ఇలాంటి 'కల్తీ'గాళ్లు ఉంటారు జాగ్రత్త..!

గజేందర్‌సింగ్‌ అనే వ్యాపారి ‘కోహినూర్, శ్రీకృష్ణ బ్రాండ్ల’ పేరిట బేగంబజార్‌ కేంద్రంగా నగరంలోని పలు హోటళ్లు, టీ స్టాళ్లకు, రెస్టారెంట్లకు ఈ పాల ప్యాకెట్లు, అనుబంధ ఉత్పత్తులైన వెన్న, పెరుగు, ఐస్‌క్రీం వంటివీ విక్రయిస్తున్నట్లు తెలుసుకున్న దర్యాప్తు అధికారులు అవాక్కయ్యారు. ప్రసిద్ధ కంపెనీల పేరుతో ప్యాకెట్లు రూపొందించి నకిలీ పాలు, పాల పదార్థాలు విక్రయిస్తున్నట్టు ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీతో పాటు ఇతర సహకార, ప్రైవేటు డెయిరీలు తరచూ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకున్న వారు లేరనే విమర్శలున్నాయి. తమ బ్రాండ్‌ను కొన్ని సంస్థలు వినియోగిస్తున్నట్టు విజయ డెయిరీ ఇటీవలి కాలంలోనే ఐదారు సార్లు ఫిర్యాదు చేసింది. ఏయే కంపెనీలు అక్రమాలకు పాల్పడుతున్నాయో ఫిర్యాదులో పేర్కొన్నా చర్యలు లేకపోవడంతో నకిలీ దందా కొనసాగుతోందనే ఆరోపణలున్నాయి.

వినియోగదారుల బలహీనతలతో : మార్కెట్లో లభ్యమయ్యే ప్రముఖ డెయిరీల పాల ఉత్పత్తుల ధరతో పోలిస్తే సగం ధరకే విక్రయిస్తుండటంతో కొందరు వీటి వైపు మొగ్గుచూపుతున్నట్టు ఎస్‌వోటీ పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ‘చిక్కగా ఉంటాయని, నాణ్యమైనవి అంటూ వాటిని హోటళ్లకు, వినియోగదారులకు అంటగడుతున్నారు నిర్వాహకులు. కోహినూర్, శ్రీకృష్ణ బ్రాండ్ల పేరిట ముద్రించిన ప్యాకెట్లలో నింపిన పాలు, అనుబంధ ఉత్పత్తులను సదరు వ్యాపారి నగరంలోని 50 హోటళ్లకు, పలు స్వీట్‌ హౌస్‌లకు విక్రయించినట్టు ప్రాథమికంగా గుర్తించామని అధికారులు తెలిపారు. ప్యాకెట్లపై స్వచ్ఛభారత్, మేక్‌ ఇన్‌ ఇండియా లోగోలనూ ముద్రించారని ఆ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్‌ నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో, రాజధాని చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లోనూ ఈ తరహా పాల తయారీ, విక్రయాలు జరుగుతున్నాయని అనుమానిస్తున్న ఆ వర్గాలు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నాయి.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నివసించే జనాభా కోటికి పైనే. రోజువారీ పాల అమ్మకాలు దాదాపు 30 లక్షల లీటర్లు. సహకార డెయిరీలు దాదాపు 10 లక్షల లీటర్లు విక్రయిస్తుండగా, ప్రైవేటు డెయిరీలు దాదాపు 18-19 లక్షల లీటర్లు అమ్ముతున్నాయి. కొందరు నకిలీ, కల్తీ పాలతో లక్ష లీటర్ల వరకూ విక్రయాలు సాగిస్తున్నారు. ప్రధానంగా మేడ్చల్‌ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఈ తరహా పాల తయారీ యథేచ్ఛగా సాగుతోందనే విమర్శలున్నాయి. పలువురు రేకుల షెడ్లు అద్దెకు తీసుకొని నకిలీ పాల తయారీ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. గత ఏడాది కాలంలో పదికిపైగా కేసులు నమోదైనప్పటికీ ఈ దందా ఆగకపోవడం గమనార్హం.

ఇంట్రస్టింగ్ : మీరు తాగే పాలు స్వచ్ఛమైనవో, కాదో ఈజీగా ఇలా తెలుసుకోండి! - ఎలాంటి కెమికల్ కలిసినా ఇట్టే గుర్తించవచ్చు! - How to Find Adulterated Milk

ABOUT THE AUTHOR

...view details