జగన్ విధానాలపై ప్రశ్నిస్తే వేధిస్తారా?- అమెరికన్ పౌరుడి ఆవేదన (ETV Bharat) Police Attack on NRI: జగన్ విధానాలు, అరాచకాలను ప్రశ్నించిన ప్రతిపక్షాలు, జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన ఘటనలు తరచూ చూస్తేనే ఉన్నాం. వైఎస్సార్సీపీ నేతలకు కొమ్ముకాస్తూ వారి అరాచకాల్లో కొంతమంది పోలీసు అధికారులు సైతం భాగస్వాములవుతున్నారు. తాజాగా ఓ అమెరికన్ పౌరుడిని పోలీసులు కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
జగన్ విధానాలపై ప్రశ్నించినందుకే తనను కిడ్నాప్ చేసి దాడి చేశారని ఎన్ఆర్ఐ, వైద్యుడు లోకేశ్ కుమార్ తెలిపారు. జగన్ విదేశీ పర్యటనకు వెళ్తున్న సమయానికి కొన్ని గంటల ముందు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న తనను సీఎం సెక్యూరిటీ అధికారులు తనను గుర్తుపట్టి అకారణంగా అరెస్టు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికన్ పౌరుడైన తనపై పోలీసులు, అధికారులు దౌర్జన్యంగా ప్రవర్తించి హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. అమానుషంగా ప్రవర్తించిన అధికారులపై కేసులు పెట్టి వారిపై చర్యలు తీసుకునే వరకు పోరాడుతానని లోకేశ్ కుమార్ వివరించారు.
టీడీపీ సానుభూతిపరులపై పోలీసుల దాష్టీకం- నిర్బంధించి రెండ్రోజుల పాటు చిత్రహింసలు - Police Attack on TDP Sympathizers
విమానాశ్రయం వద్ద జరిగిన ఘటనపై అమెరికా ఎంబసీతోపాటు ప్రధాని కార్యాలయం, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్ తదితరులకు సమాచారం ఇచ్చానని చెప్పారు. చాలా సేపు తనను తిప్పిన తర్వాత గన్నవరంలోని ఓ చిన్న ఆసుపత్రిలో చూపించారని, తన పరిస్థితిని చూసిన అక్కడి డాక్టర్ వెంటనే హుద్రోగ విభాగం ఉన్న ఆసుపత్రిలో చేర్పించాలని సూచించారని అన్నారు. అంబులెన్స్‌ను వెంటనే పిలిపించాలని చెప్పినా చాలాసేపటి వరకు రాకుండా ఆలస్యం చేశారని, చివరికి విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రికి వచ్చి వైద్య సహాయం పొందిన తర్వాత కొంతవరకు స్వస్థత చేకూరిందని తెలిపారు.
ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నానని, అవినీతిని ప్రశ్నిస్తున్నాననే కోపంతోనే తనను హతమార్చేందుకు జగన్, అతని మనుషులు పోలీసుల ద్వారా కుట్ర పన్నినట్లుగా కనిపిస్తోందని అన్నారు. విమానాశ్రయం వద్ద తనను అపహరించి, దాడి చేసి, నిర్భందించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని కోరుతున్నానని, సోమవారం హైకోర్టులో ఈ ఘటనపై కేసు దాఖలు చేస్తానని అన్నారు.
'కేసు పెట్టకూడదంటే 2 లక్షలు ఇవ్వాలి'- బాధితులకు పోలీసుల ఆఫర్ - YSRCP Leaders Attack on Family
అవసరమైతే డీజీపీ, సీఎస్‌లపై ప్రైవేటు కేసులు కూడా వేసి న్యాయపోరాటం చేస్తానన్నారు. ఆయుష్ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న సమయంలోనూ పోలీసుల తీరు అప్రజాస్వామికంగా ఉందని, తన న్యాయవాది వచ్చి ఏ సెక్షన్ కింద కేసు పెట్టారు? ఎందుకు నిలువరిస్తున్నారని ప్రశ్నించిన మీదట సీఆర్‌పీసీ 151 సెక్షన్ కింద తనపై కేసు నమోదు చేసినట్లు చెప్పారని, ఆ తర్వాత వ్యక్తిగత పూచీ కత్తుపై తనను విడుదల చేశారని అన్నారు.
ఆయుష్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన డాక్టర్ లోకేశ్‌ను విజయవాడలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులు పరామర్శించారు. విమానాశ్రయం వద్ద జరిగిన ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
"జగన్ విధానాలు, అరాచకాలను ప్రశ్నించినందుకే కిడ్నాప్ చేసి దాడి చేశారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న నన్ను సీఎం సెక్రటరీ అధికారులు గుర్తుపట్టారు. నన్ను బంధించి బలవంతంగా కారులోకి ఎక్కించారు. అకారణంగా అరెస్టు చేయించి అటూఇటూ తిప్పుతూ కొట్టారు. ఛాతీ నొప్పి వస్తుందని చెప్పినా వినకుండా పోలీసులు హింసించారు. అమెరికన్ పౌరుడైన నాపై పోలీసులు, అధికారుల దౌర్జన్యంగా ప్రవర్తించారు. స్టేషన్‌లో ఉన్న పోలీసులకు బ్యాడ్జ్‌లు కూడా లేవు. ఏ అధికారంతో నన్ను అరెస్టు చేసి వేధిస్తారు?. అమానుషంగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. పోలీసులు, అధికారులపై చర్యలు తీసుకునే వరకు పోరాడుతా." - లోకేశ్ కుమార్, బాధితుడు