Sexual Harassment Case in Eluru District: వసతి గృహం ముసుగులో బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన కామాంధుడిని, అతనికి సహకరించిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ మైనర్ బాలికను అత్యాచారం చేయడంతో పాటు పలువురు బాలికలను లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు.
ఏలూరులోని గ్రీన్ సిటీలో ఉంటున్న బొమ్మిరెడ్డిపల్లి శశికుమార్ అనే వ్యక్తి చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లిలో హాస్టల్ వార్డెన్‌గా పని చేస్తున్నాడు. దీంతోపాటు ఏలూరులో ఓ ఫొటో స్టూడియోను కూడా నిర్వహిస్తున్నాడు. ఏలూరు జిల్లాలో ఓ ప్రముఖ ఆశ్రమానికి చెందిన వారు వసతి గృహాన్ని నిర్వహిస్తున్నారు. ఆశ్రమంలో శేషం రాజు అనే వ్యక్తి మేనేజర్‌గా ఉండేవారు. శేషం రాజును పరిచయం చేసుకున్న శశికుమార్, తాను వార్డెన్‌గా పని చేస్తున్నానని, తనకు హాస్టల్ మేనేజ్మెంట్ బాగా తెలుసని, తనను కూడా భాగస్వామ్యం చేయమని కోరాడు.
అలా నెమ్మదిగా వసతి గృహం వద్ద వార్డెన్‌గా తన భార్యను, సంరక్షకురాలిగా మేనకోడలిని పెట్టాడు. కొంతకాలానికి శేషం రాజుపై ఆశ్రమం నిర్వాహకులకు చెడుగా చెప్పి అతనిని బయటకు వెళ్లేలా చేశాడు. దీంతో శశికుమార్ వసతి గృహాన్ని చేజిక్కించుకున్నాడు. అప్పటి నుంచి వసతి గృహంలోని బాలికలపై పెత్తనం చేస్తూ వారిని లైంగిక వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. ఫొటోగ్రఫీ నేర్పిస్తానని చెప్పి కొంతమంది బాలికలను ఒంటరిగా బయటకు తీసుకెళ్లి అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలిందని ఎస్పీ తెలిపారు.
ఒక బాలికను బాపట్ల తీసుకొని వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని వెల్లడించారు. ఈ విషయంపై బాలికల తల్లిదండ్రులకు తెలిసి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఈ ముగ్గురినీ అరెస్టు చేసి రిమాండ్‌కి పంపిస్తున్నట్లు తెలిపారు. ఫోక్సో చట్టం కింద ముద్దాయికి శిక్షపడేలా చేస్తామని అన్నారు. అదే విధంగా అనధికారకంగా నడుపుతున్న వసతి గృహాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇటువంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఏలూరు జిల్లాలో వార్డెన్ భర్త ఆకృత్యాలు - ఫొటోషూట్‌లంటూ బాలికలపై లైంగిక దాడి - Eluru Girls Hostel Incident