Polavaram Project Designs With Foreign Expertise :ఇక నుంచి పోలవరం ప్రాజెక్టులో డిజైన్ల రూపకల్పన, ఆమోదం విదేశీ నైపుణ్యంతోనే సాగుతాయి. గతంలో పోలవరం డిజైన్లు ఆమోదించేందుకు కేంద్ర జలసంఘం డ్యాం డిజైన్ రివ్యూ ప్యానల్‌ను ఏర్పాటు చేసింది. ప్రాజెక్టు డిజైన్లను త్వరగా ఆమోదించేందుకు 2014-19 మధ్య కేంద్రంతో చంద్రబాబు ప్రభుత్వ సంప్రదింపుల ఫలితంగా ఈ ఏర్పాటు జరిగింది. ప్రస్తుతం డీడీఆర్‌పీ స్థానంలో కేంద్ర జలసంఘం కొత్తగా ఏర్పాటు చేసింది. జగన్ హయాంలో పోలవరం పనులు నెలల తరబడి నిలిచిపోవడంతో ఎదురైన సవాళ్ల పరిష్కారం పెద్ద తలనొప్పిగా మారింది.
దాంతో ఈ ప్రాజెక్టుకు విదేశీ నిపుణుల సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. పోలవరం పనులను మేఘా సంస్థ చేపట్టింది. ఆ సంస్థ తరఫున డిజైన్ కన్సల్టెన్సీ సేవలు తీసుకోవాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిర్దేశించింది. ఈ క్రమంలోనే ఆస్ట్రియాకు చెందిన ఆఫ్రి కన్సల్టెన్సీని నియమించారు. మరో వైపు కేంద్రజలసంఘం అంతర్జాతీయ స్థాయిలో టెండర్లు పిలిచి పోలవరం సవాళ్లను పరిష్కరించేందుకు విదేశీ నిపుణుల బృందాన్ని నియమించింది.
ఇప్పటికే రెండుసార్లు ఆ బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించి కీలక సిఫార్సులు చేసింది. వారి పరిశీలన, అధ్యయనాల తర్వాత పోలవరంలో ఎలా ముందుకు సాగాలో నిర్ణయాలు వెలువడ్డాయి. ఆ క్రమంలో తాజా డిజైన్లు ఆమోదించేందుకు వారి నైపుణ్యాన్ని ఉపయోగించుకోబోతున్నారు.
ప్రస్తుతం పోలవరంలో ఆఫ్రి సంస్థ కొత్త డయాఫ్రం వాల్, ప్రధాన డ్యాం డిజైన్లు రూపొందిస్తోంది. ఇప్పటికే కొత్త డయాఫ్రం వాల్ డిజైన్లను తాజా వర్క్‌షాపులో విదేశీ నిపుణులు ఆమోదించారు. ఆఫ్రి సంస్థ డిజైన్లు రూపొందించి పోలవరం అధికారులకు సమర్పిస్తుంది. దీనికిముందే పోలవరంలో చేసిన అధ్యయనాల పరిశీలనలు, ఇతర అంశాలపై ఎప్పటికప్పుడు విదేశీ నిపుణుల బృందంతో చర్చిస్తారు.
ఆ చర్చల తర్వాతే డిజైన్లు ఓ కొలిక్కి వస్తాయి. పోలవరం అథారిటీ ద్వారా విదేశీ నిపుణులకు ఆ డిజైన్లు సమర్పిస్తారు. వారు వీటిని ఆమోదిస్తారు. తర్వాత కేంద్రజలసంఘం నిపుణుల వద్దకు అవి చేరతాయి. వాటిని కేంద్రజలసంఘం నిపుణులు పరిశీలించి తుది అనుమతులు ఇస్తారు. ఆ ప్రకారమే నిర్మాణ పనులు చేపట్టాలి. ఆలస్యం కాకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌లోనూ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు.
అంతర్జాతీయ నిపుణులు
డేవిడ్ బి.పాల్ (అమెరికా)
డ్యాం భద్రత, మౌలిక వసతుల నిర్వహణలో 35 ఏళ్ల అనుభవం ఉంది. అంతర్జాతీయ డ్యాం భద్రతా సంస్థలో సీనియర్ కన్సల్టెంట్.
రిచర్డ్ డోన్నెల్లీ (కెనడా)
సివిల్ ఇంజినీరింగ్, ప్రధానంగా హైడ్రాలిక్ నిర్మాణాలు, నీటివనరుల నిర్వహణలో 30 ఏళ్ల అనుభవం ఉంది.
గియాస్ ఫ్రాంకో డి సిస్కో (అమెరికా)
పెద్ద డ్యాంల నిర్మాణం, నిర్వహణ, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో 28 సంవత్సరాల అనుభవం ఉంది. అడ్వాన్స్‌డ్ స్ట్రక్చరల్ సొల్యూషన్స్‌లో చీఫ్ ఇంజినీరు.
సీస్ హించ్‌బెర్గర్ (కెనడా)
జియోటెక్నికల్ ఇంజినీరింగ్, నీటిపారుదల నిర్వహణలో 25 ఏళ్ల అనుభవం ఉంది. జియోటెక్నికల్ కన్సల్టెంట్.