Polavaram Future Was Reversed Under YSRCP Regime: వైఎస్సార్సీపీ పాలనలో పోలవరం భవిష్యత్తు రివర్స్ అయింది. తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధినంతా ఐదు సంవత్సరాలలో జగన్ బూడిదలో పోసిన పన్నీరు చేశారు. కొత్త ప్రభుత్వం ఇప్పుడు ప్రాజెక్టు పనులు ప్రారంభిద్దామన్నా ఒక్క అడుగు ముందుకేయలేని దుస్థితి. 2019 జూన్‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్‌కు పోలవరంపై నివేదించిన అదే జలవనరులశాఖ అధికారులు తాజాగా సోమవారం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజెంటేషన్ ఇచ్చారు. దీన్ని చూస్తే పోలవరంపై గత సర్కారు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో ఇట్టే అర్థమవుతుంది.
ప్రశ్నార్థకంగా మారిన పోలవరం కీలక కట్టడాలు - చంద్రబాబు ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్! - Polavaram Construction
జగన్ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు ఎంతో వెనక్కి వెళ్లిపోయింది. అంతకుముందు ఐదు సంవత్సరాలు జరిగిన అభివృద్ధి అంతా వైఎస్సార్సీపీ పాలన సాగిన గత ఐదు సంవత్సరాలలో సర్వనాశనమైపోయిన పరిస్థితి కళ్ల ముందే కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు పనులు ప్రారంభించలేని దుస్థితి. ఒక్క అడుగూ ముందుకేయలేని స్థితి. ప్రతి అంశంలోనూ అనిశ్చితి, ప్రతి నిర్మాణమూ సవాల్ విసిరే పరిస్థితి. ప్రాజెక్టు వాస్తవ ముఖ చిత్రాన్ని ఒక్క ముక్కలో చెప్పాలంటే 2019లో ఏ స్థాయిలో ఉందో అంతకన్నా వెనక్కి వెళ్లిపోయింది.
అధికారుల లెక్కల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జగన్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో సాధించిన పురోగతి కేవలం 4.5 శాతమే. ప్రాజెక్టు నిర్మాణంలో మొత్తం 75.77 శాతం పురోగతి జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. అందులో డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తైనట్లు లెక్కిస్తున్నారు. డయాఫ్రం వాల్ 2019, 2020 వరదల్లో ధ్వంసమైందనీ అధికారులే చెప్పారు. అదీ జగన్ ప్రభుత్వ హయాంలోనే. ఆ డయాఫ్రం వాల్ స్థానంలో మళ్లీ కొత్తగా నిర్మాణం చేపట్టాలని ఇప్పటికే జలవనరులశాఖ అధికారులు ప్రతిపాదించారు. ఇందుకు దాదాపు 1,000 కోట్లు ఖర్చవుతుందని, 457 రోజుల సమయం పడుతుందని అంచనా వేశారు.
పోలవరం పరిస్థితి ఏంటి?- నేడు ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం - CM Chandrababu Visit to Polavaram
గతంలో డయాఫ్రంవాల్ నిర్మాణానికి ఖర్చు చేసిన మొత్తం కన్నా ఇది రెండింతలు. డయాఫ్రం వాల్‌కు మరమ్మతులు చేయాలన్నా రూ. 447 కోట్లు వ్యయమవుతుంది. 288 రోజుల సమయం పడుతుంది. ఈ లెక్కన అధికారులు లెక్కిస్తున్న పురోగతి నుంచి ఆ డయాఫ్రం వాల్‌ను మినహాయించాలా? అక్కర్లేదా అన్నది ప్రశ్న. అలా మినహాయిస్తే అడుగు ముందుకు పడిందా? వెనక్కి పడిందా అన్నది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పోలవరం ప్రాజెక్టులో 500 కోట్లతో నిర్మించిన ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాంలు లీకేజీలతో సతమతమవుతున్నాయి. సీపేజీ అంచనాలకు మించి వస్తోంది. నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం నిర్మాణాలు జరగలేదు.
కేంద్ర నిపుణులు ముందే హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పెడచెవిన పెట్టిందని కేంద్ర జల్‌శక్తి శాఖలో కీలక స్థానంలో ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి చెప్పారు. ఆ రెండు కట్టడాలూ మళ్లీ బాగు చేసుకోవాల్సిందే. అందుకు వందల కోట్లు ఖర్చవుతుంది. అసలు ఎలా మరమ్మతు చేయాలో కూడా ఇప్పటివరకు తేల్చలేదు. అధికారులు లెక్కించిన 75.77 శాతం పురోగతి నుంచి ఈ కట్టడాలను మినహాయిస్తే ఈ ప్రాజెక్టు ముందుకెళ్లినట్లా? వెనక్కి మళ్లినట్లా?.
పోలవరం పూర్తికి నాలుగేళ్లు పడుతుందని అధికారులు అంటున్నారు- సీఎం చంద్రబాబు - AP CM Chandrababu on Polavaram
2020 వరదలకు ముందు ప్రధాన డ్యాం నిర్మించాల్సిన ప్రాంతం భేషుగ్గా ఉంది. ఎగువ కాఫర్ డ్యాం గ్యాప్‌లను సకాలంలో జగన్ ప్రభుత్వం పూడ్చలేకపోయింది. దీంతో 2020లో భారీ వరదలకు ఆ ప్రాంతమంతా ఉద్ధృతమైన నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. పెద్ద పెద్ద అగాథాలు ఏర్పడ్డాయి. ప్రధాన డ్యాం గ్యాప్ 1 ప్రాంతంలో 35 మీటర్ల లోతున, గ్యాప్ 2 వద్ద 26 మీటర్ల లోతున ఇసుక కొట్టుకుపోయింది. ప్రధాన డ్యాం ఛానల్ 90 మీటర్ల నుంచి 390 మీటర్ల వరకు అంటే దాదాపు 300 మీటర్ల మేర, మరోచోట 42 మీటర్ల మేర ఇసుక కోతకు గురై భారీ అగాథాలు ఏర్పడ్డాయి.
కాఫర్ డ్యాం వద్ద 280 మీటర్లలో 36.50 మీటర్ల లోతున అగాథాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఇక్కడ ఇసుక నింపేందుకు రూ.2,200 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా ఎంత ఖర్చు చేయాలో కూడా తెలియదు. స్పిల్ వే రక్షణకు రూ.80 కోట్లతో నిర్మించిన గైడ్‌బండ్ ధ్వంసమయింది. మొత్తం పురోగతి నుంచి దీన్ని కూడా మినహాయించాలి కదా! ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే మొత్తం ప్రాజెక్టు పురోగతి 75.77 శాతం వద్ద ఉంటుందా లేక 50 శాతానికి పడిపోతుందా అనేది ప్రశ్నార్థకం మారింది.
పోలవరం ఎప్పటికి పూర్తిచేద్దామనుకుంటున్నారు?- ప్రాజెక్టు నిర్మాణ బాధ్యులపై సీఎం అసహనం
ఐదు సంవత్సరాల జగన్ పాలనలో పోలవరంలో జరిగిన వైఫల్యాలు అన్నీ ఇన్నీ కాదు. రివర్స్ టెండర్ల పేరుతో గుత్తేదారును మార్చొద్దని కేంద్ర జల్‌శక్తి శాఖ హెచ్చరించినా జగన్ పట్టించుకోలేదు. 2019 నవంబరులో కొత్త గుత్తేదారుకు పనులు అప్పగించినా సంవత్సరంపాటు కనీస పనులు కూడా చేయలేదు. అప్పట్లో రాష్ట్ర అధికారులు కేంద్ర జల్‌శక్తి శాఖకు సమర్పించిన పురోగతి లెక్కలు ఈ విషయాన్ని బహిర్గతం చేశాయి. 2019 వరదలకు డయాఫ్రంవాల్ దెబ్బతిందని జగన్ సర్కార్ వాదన. 2020 వరదలకే డయాఫ్రంవాల్ విధ్వంసమైందనేది అధికారుల మాట. సంవత్సన్నర కాలంలో ఎగువ కాఫర్ డ్యాం నిర్మించి, గ్యాప్‌లు పూడ్చి ఉంటే డయాఫ్రం వాల్ ధ్వంసమయ్యేది కాదని హైదరాబాద్ ఐఐటీ నిపుణులు కేంద్రానికి ఇచ్చిన నివేదిక తేల్చింది. 2019లోనే డయాఫ్రం వాల్ ధ్వంసమైతే ఇప్పటివరకు దాన్ని ఏం చేయాలో ఎందుకు తేల్చలేదన్నదు. 2024 వరకు ఈ అంశంపై జగన్ సర్కారు ఎందుకు దృష్టి సారించలేదన్నది ప్రశ్న.
పోలవరంలో జరిగిన నష్టం, ప్రస్తుత కష్టానికి ఎవరు బాధ్యులు?- ఏపీ జీవనాడిపై సీఎం నజర్ - PRATHIDWANI