PM Modi on Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతిలో తొక్కిసలాట జరగడం బాధాకరమని అన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా సాయం అందిస్తోందని తెలిపారు.
RAHUL GANDHI RESPONSE: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట చాలా బాధాకరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. బాధితులకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
CM CHANDRABABU ON TIRUPATI STAMPEDE: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం జరిగిన తోపులాటలో ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టోకెన్ల కోసం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చిన సందర్భంలో చోటుచేసుకున్న ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని సీఎం అన్నారు. ఈ ఘటనలో గాయాలైన వారికి అందుతున్న చికిత్సపై అధికారులతో సీఎం ఫోన్లో మాట్లాడారు.
ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు: జిల్లా, టీటీడీ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిని సీఎం తెలుసుకుంటున్నారు. అదే విధంగా తిరుపతిలో జరిగిన తోపులాట ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. డీజీపీ, టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమని అన్నారు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమైన అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు.