TGPSC Group-1 Notification :గ్రూప్-1 పోస్టుల భర్తీ నిమిత్తం 2022లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వికారాబాద్, యాదాద్రి భువనగిరి, హనుమకొండ, వరంగల్ జిల్లాలకు చెందిన జి.దామోదర్ రెడ్డి, మరో ఐదుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సుధీర్ వాదనలు వినిపిస్తూ, 2022లో 503 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారని, వివిధ కారణాల వల్ల పరీక్ష రద్దయిందని, అయితే గతంలో పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులకే దీన్ని పరిమితం చేయాల్సి ఉందన్నారు. 503 ఖాళీలకు అదనంగా మరో 60 పోస్టులను కలిపి తాజాగా నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదన్నారు. కొత్తగా ఏర్పడిన 60 ఖాళీలకు ప్రత్యేకంగా మరో నోటిఫికేషన్ జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
అంతేగాకుండా ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడం సరికాదన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ టీజీపీఎస్సీ రాజ్యాంగబద్ధమైన సంస్థ అని, పరీక్షను రద్దు చేసి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసే అధికారం ఉందన్నారు. అదనపు ఖాళీలను చేర్చడం వల్ల అభ్యర్థులకు ప్రయోజనం ఉంటుందని తెలిపారు. దీనిపై తదుపరి విచారణను న్యాయమూర్తి ఈ నెల 30 కి వాయిదా వేశారు.