Person Raising Assel Breed Chickens in Wanaparthy:తెలంగాణలో నాటుకోడి పేరు చెబితే పందెం కోళ్లతో పాటు, మసాలాతో వండిన నాటు కోడి కూర గుర్తొస్తాయి. అదే ఆంధ్రాలో అయితే సంక్రాంతికి కోడి పందేలకు నాటు కోడికి భారీగా డిమాండ్ ఉంటుంది. అందులో ప్రత్యేకంగా చాలా మంది పందేల కోసం నాటుకోళ్లను పెంచుతారు. వాటి కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి కోళ్లను పెంచుతారు. ఆ తరువాత కోళ్లను అమ్మే సయమంలో ఆ ఖర్చుకు కొన్ని రెట్ల ఎక్కువ లాభాలను చూస్తారు. ఒకరకంగా చెప్పాలంటే రకాన్ని బట్టి ఒక్కో కోడి ధర రూ.50 వేలు నుంచి రూ.లక్ష లేదా అంతకు మించి ఉంటుంది. కానీ తెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఓ వ్యక్తి మాత్రం సరదా కోసం నాటు కోళ్లను పెంచి లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నాడు.
తెలంగాణలోని వనపర్తి మండలం రాజనగరం గ్రామానికి చెందిన గురునందన్ రెడ్డి అనే వ్యక్తి కొన్నేళ్లుగా తమిళనాడులోని సేలంకు చెందిన ఆసిల్ జాతి కోళ్లను పెంచుతున్నాడు. వాటి తిండికే అతనికి లక్షల్లో ఖర్చు అవుతుంది. కానీ వాటిని అమ్మితే మాత్రం దానికి రెట్టింపు స్థాయిలో ఆదాయం వస్తుంది. గురునందన్ రెడ్డి 2006లో మార్కెటింగ్ శాఖ కార్యదర్శిగా ఉద్యోగ విరమణ పొందాక వ్యవసాయంతో పాటు కోళ్ల పెంపకపై దృష్టి సారించారు. దీంతో రకరకాల కోళ్లను పెంచుతున్నారు. చిలక ముక్కు, నెమలి తోక, పొడవాటి మెడ, బలమైన శరీర సౌష్టవం ఉన్న అసిల్ జాతి కోళ్లకు డిమాండ్ బాగా ఉందని గమనించారు.