PERNI NANI PDS RICE CASE: మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్‌లో మాయమైన రేషన్ బియ్యం కేసులో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై కేసు నమోదు చేసి నెలకావొస్తున్నా ఇప్పటివరకు నిందితులను పట్టుకోలేదు. రేషన్ బియ్యం మాయంలో పేర్నినాని కుటుంబం అడ్డంగా దొరికిపోయినా చర్యలు తీసుకోవడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు చేష్ఠలుడిగి చూస్తున్నారంటూ కూటమి పార్టీల శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.
కేసు నమోదు చేసి 15 రోజులపైనే: మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన మచిలీపట్నంలోని ఇన్వెస్టర్ గోదాములో మాయమైన రేషన్ బియ్యం 7వేల 577 బస్తాలు. అధికారులు మొదట్లో 3వేల708 బస్తాలని చెప్పారు. తర్వాత 4వేల840 బస్తాలన్నారు. ఇప్పుడు పూర్తిస్థాయి లెక్కల తర్వాత ఏకంగా 7వేల577 బస్తాలు మాయమైపోయాయని తేల్చారు. ఈ లెక్క తేల్చడానికి అధికారులకు నెల రోజులు పట్టింది. తమ గోదాములో బియ్యం లెక్కలు తగ్గాయంటూ పేర్ని నాని కుటుంబసభ్యులు గత నెల 26న లేఖ రాస్తే ఆ తగ్గిన బియ్యం ఎన్నో గురువారానికి తేల్చారు.
బియ్యం మాయం ఘటనపై పోలీసుల తీరూ ఇంతే. కేసు నమోదు చేసి 15 రోజులపైనే అవుతోంది. ఇప్పటివరకు నిందితుల్ని అరెస్టు చేయలేకపోయారు. పైగా పారిపోయే అవకాశం ఇచ్చారు. ఇది చాలదా? ఘనత వహించిన అధికార యంత్రాంగం ఎంత చురుగ్గా పనిచేస్తుందో, ఎంత వేగంగా స్పందిస్తుందో చెప్పడానికి? నిజంగా వాళ్లే అనుకుంటే, లెక్కలు తేల్చడానికి, నిందితుల్ని అరెస్టు చేయడానికి ఇన్ని రోజులు అవసరమా? వీళ్లే కాదు గత ప్రభుత్వంలో తమను వెంటాడి వేధించిన వైఎస్సార్సీపీ ముఖ్యనేత పేర్ని నాని కుటుంబ అక్రమాలు బయటపడినా మంత్రి కొల్లు రవీంద్రతోపాటు ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరు చూసి కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలే ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారంలో ఉంది మనమా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయా? పేర్ని నాని అంటే ఇంకా భయమా? అనే ప్రశ్న వారిలో వ్యక్తమవుతోంది.
పిటిషన్ ఉపసంహరించుకున్న పేర్ని నాని, ఆయన కుమారుడు
ఉదాసీనంగా వ్యవహరిస్తున్న ముఖ్యనేతలు: డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే రేషన్ బియ్యంపై రాజకీయం చేస్తున్నారంటూ మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పైనా విరుచుకుపడుతున్నారు. రేషన్ బియ్యం మాయం ఘటనలో పేర్ని నాని కుటుంబం అడ్డంగా దొరికినా కూటమి ప్రభుత్వం, ముఖ్యనేతలు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటమూ చర్చనీయాంశంగా మారింది.