People Suffering From Dengue Fevers in Manyam District :మన్యం జిల్లా వాసులను జ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. మొన్నటి వరకు విషజ్వరాలు.నిన్న మలేరియా. తాజాగా డెంగీ జ్వరాలు ప్రజలను గడగడా వణికిస్తున్నాయి. గత కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలతో ప్రజలు డెంగీ జ్వరాల బారిన పడుతున్నారు. రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి.
గడగడలాడిస్తున్న డెంగీ జ్వరాలు :పార్వతీపురం మన్యం జిల్లాలో డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ సంవత్సరం జనవరి నుంచి ఆగస్టు వరకు మలేరియా కేసులు అధికంగా నమోదయ్యాయి. ఇప్పటి వరకు 2,264 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. ఆగస్టులో అత్యధికంగా 620 మంది వ్యాధితో మంచం పట్టారు. ఈ నెలలో ఆ సంఖ్య కొంతమేర తగ్గింది. అంతలోనే చాప కింద నీరులా డెంగీ విస్తరిస్తోంది. జనవరి నుంచి జులై వరకు కేవలం 21 మంది వ్యాధి బారిన పడగా గత నెలలో 42 మంది డెంగీతో మంచం పట్టారు.
డెంగీ జ్వరం వచ్చినట్లు ఎలా తెలుస్తుంది- ప్లేట్‌లెట్లు ఎప్పుడు ఎక్కించాలి? - Dengue Severe symptoms
డెంగీ బారిన పడుతున్న జనం :ఆకస్మికంగా అధిక జ్వరం రావటం, తీవ్రమైన తలనొప్పి, కళ్లు మంటలు, కీళ్లనొప్పులు, అలసట, వికారం, వాంతులు, అతిసారం, చర్మంపై దద్దర్లు, ఆకలి మందగించటం వంటి లక్షణాలతో జనం అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి చికిత్స పొందినా, జ్వరాల తీవ్రత తగ్గక పోవటంతో బాధితులు బెంబేలెత్తుతున్నారు. వ్యాధి నిర్ధారణ కోసం సుదూర ప్రాంతాల నుంచి పార్వతీపురంలోని జిల్లా ఆసుపత్రి, పాలకొండ ప్రాంతీయ ఆస్పత్రులకు రావాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.