People Suffering from CM Jagan Bus Yatra : ఉత్తరాంధ్రలో సీఎం జగన్ బస్సు యాత్ర జనానికి విసుగు తెప్పించింది. సరిహద్దు జిల్లాల నుంచి భారీగా బస్సులు తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. గంటల తరబడి పడిగాపులు కాసినా బస్సులు రాకపోవడంతో జనం చిర్రెత్తిపోయారు. సభకు తరలించిన మహిళలనూ నేతలు రోడ్డుపై వదిలేడంతో ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
డబ్బులిచ్చి ఆర్టీసీ బస్సుల్లో తరలించినా వెనుదిరిగిన జనం - వైసీపీ శ్రేణుల విస్మయం
సీఎం జగన్ బస్సుయాత్ర ప్రయాణికుల పాలిట దండయాత్రగా మారింది. ఉత్తరాంధ్రలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా విశాఖలో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీఎం బస్సు యాత్ర కోసం మహిళలను తరలించగా మధురవాడ స్టేడియానికి ఉదయం 9గంటలకే రావాల్సిన జగన్ చాలాసేపటికి రాకపోటంతో మహిళలు అవస్థలు పడ్డారు. వారిని తీసుకొచ్చిన వైసీపీ నాయకులు పట్టించుకోపోవడంతో చాలా మంది రోడ్లపైనే ఉండిపోయారు. మరికొందరు ఎండ దెబ్బకు తాళలేక బస్సుల కింద తలదాచుకుని సేదతీరారు.
ఆర్టీసీ బస్సులన్నీ సిద్ధం సభకు తరలిపోవడంతో విజయనగరంలో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. గంటల తరబడి వేచిచూసినా బస్సులు రాకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో ప్రయాణాలు సాగించారు. సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి, విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులు ఎటూ వెళ్లలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. కేవలం 20 శాతం బస్సులే నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు వెల్లడించడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలతో పాటు ఒడిశా బస్సులను ఆశ్రయించారు. కొన్ని డిగ్రీ కళాశాలల్లో మిడ్ పరీక్షలు జరగడంతో విద్యార్థులు నానా తిప్పలు పడ్డారు.