People Suffering Due to Heavy Rains in Alluri District : అల్లూరి జిల్లాలో వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రంపచోడవరం మండలం పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడి రాకపోకలు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే శిరీష దేవి సొంత ఖర్చులతో జేసీబీ ఏర్పాటు చేసి కొండ చరియల తొలగింపు పనులు చేపట్టారు. ఎగువ నుంచి వస్తున్న వర్షపు నీటితో భూపతిపాలెం జలాశయం నిండుకుండలా మారడంతో అధికారులు మూడు గేట్ల ద్వారా నీరు విడుదల చేశారు.
శాంతించిన గోదారమ్మ - అయినా ముంపులోనే లంకగ్రామాలు, వేలాది ఎకరాలు - Godavari Floods in Dhavaleswaram
ప్రమాదకరమైన వాగుపై సాహసం :వర్షాకాలంలో మారేడుమిల్లి మండలం సున్నంపాడు, నూరిపూడి గ్రామాల మధ్య పెద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నూరిపూడిలో విద్యుత్ సమస్య రావడంతో విద్యుత్ శాఖ సిబ్బంది ప్రమాదకరమైన పెద్ద వాగుపై వైర్లు కట్టి సాహసం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసర సమయాల్లోనూ తాడు సాయంతో గిరిజనులు వాగు దాటాల్సిన దుస్థితి ఏర్పడింది. వాగుపై వంతెన నిర్మాణం గతంలో చేసిన శంకుస్థాపనతో నిలిచిపోయింది. అధికారులు స్పందించి వంతెన నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు.
మృతదేహాన్ని తరలించేందుకు అవస్థలు :జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలతో వాగులు, గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గెడ్డల ఉద్ధృతితో గిరిజనులకు అవస్థలు తప్పడం లేదు. డుంబ్రిగుడ మండలం పోతంగి పంచాయతీ శీలంగొంది గ్రామానికి చెందిన బడ్నాయిని పెదడొంబు(67) గురువారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. ఈయన్ను ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబీకులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. గ్రామానికి సమీపంలోని చంపాపట్టి గెడ్డ వరకు అంబులెన్స్ చేరుకోగా గెడ్డను దాటించి అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధాహ్నం మూడు గంటలకు ఆయన మృతి చెందారు. రాత్రి ఏడు గంటలకు చంపాపట్టి గెడ్డ వరకు అంబులెన్సులో మృతదేహాన్ని తీసుకొచ్చారు. అక్కడి నుంచి బాధిత కుటుంబికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మృతదేహాన్ని ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గెడ్డను దాటించారు.