Political situation in Godavari districts:ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పదిమందిని కదిలిస్తే ఏడుగురు తమ ఇబ్బందులు చెబుతున్నారు. సామాన్యులు, పేదలు కూడా ధరల పెరుగుదలతో కష్టపడుతున్నామని వివరించారు. ఈటీవీ భారత్ ప్రత్యేక ప్రతినిధి మంగళ, బుధవారాల్లో ఈ రెండు జిల్లాల్లోనూ విస్తృతంగా పర్యటించారు. ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం, తణుకు మీదుగా నిడదవోలు చేరారు. అక్కడి నుంచి రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరిగి రావులపాలెం, అంబాజీపేట, రాజోలు, చించినాడ వంతెన, పొదలాడ, తాటిపాక మీదుగా అంబాజీపేట, అమలాపురం వరకు పర్యటించారు. ఈ ప్రాంతాల్లో ప్రజలతో చర్చించిన తరువాత వైసీపీ ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతపై ప్రత్యేక కథనం.
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, రాజకీయ పరిస్థితులపై తమ అభిప్రాయాలు చెప్పేందుకు ఎవరూ నిరాకరించలేదు. ప్రశ్నించిన ప్రతి వ్యక్తీ స్పందించారు. కాకపోతే ‘మీరు ఎక్కడి నుంచి వచ్చారు’ అని ఎదురు ప్రశ్నించారు. వ్యక్తిగత పని మీద ఇలా వచ్చామని, ఆసక్తి కొద్దీ అడుగుతున్నామని చెప్పి వారి అభిప్రాయాలు సేకరించగా చాలా స్వేచ్ఛగా మనసులో మాట చెప్పారు. ప్రభుత్వంపై మీ అభిప్రాయాలేంటి, మీ ప్రాంతంలో ఏమనుకుంటున్నారని ఎదురు ప్రశ్నించి ఆసక్తిగా విన్నారు.
మందుబాబుల్లో ఆగ్రహం:మందుబాబులు ప్రస్తుత పరిస్థితులపై ఆగ్రహంగా ఉన్నారు. అమలాపురం సెంటర్లో గురువారం రాత్రి ఒక వ్యక్తి ఎదురయ్యారు. ‘గతంలో క్వార్టర్ బాటిల్ 50 రూపాయలకు కొనేవాళ్లమని వెల్లడించారు. కిక్కు ఉండేదని, ఇప్పుడు ధర పెరిగిందని అయితే, ఎంత తాగినా కిక్కే లేదని ఆరోపించాడు. బటన్లు నొక్కి డబ్బులిచ్చినా అన్నీ ఇలాగే ఖర్చయిపోతున్నాయని వాపోయాడు. ఇవన్నీ ఎన్నికల్లో ప్రభావం చూపించొచ్చని వ్యాఖ్యానించారు. పదిమందిలో ముగ్గురు, నలుగురు ఇళ్ల స్థలాలు వచ్చాయని, పింఛన్లు వస్తున్నాయని, పథకాల సొమ్ములు వస్తున్నాయని సానుకూలంగా స్పందించారు. పనిలో పనిగా ధరలు ఇబ్బందులు పెడుతున్నాయని, విద్యుత్తు ఛార్జీలు పెరిగిపోయాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.
రేపు తిరువూరులో 'నిజం గెలవాలి' ముగింపు సభ - ముమ్మర ఏర్పాట్లు - Bhuvaneshwari Nijam Gelavali Yatra