Pensioners Facing Problems in Andhra Pradesh: పింఛన్ పంపిణీలో ప్రభుత్వ కుట్రలకు అవ్వాతాతలు అల్లాడిపోతున్నారు. మలమలమాడిపోయే ఎండలో పెన్షన్ డబ్బుల కోసం బ్యాంకుల వ్దద విలవిల్లాడుతున్నారు. ఇంట్లోంచి కదల్లేని వారి పరిస్థితి దయనీయంగా ఉంది. పండుటాకుల్ని ప్రభుత్వం అవస్థలపాలు చేస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. రాజకీయాల కోసం వృద్ధులు, వికలాంగులపై ప్రభుత్వం పగబట్టినట్లుగా వ్యవహరిస్తోంది. పింఛన్ డబ్బులు ఇంటివద్దకు తెచ్చి ఇచ్చే అవకాశం ఉన్నా మండుటెండలో వారిని బ్యాంకుల చుట్టూ తిప్పుతోంది. వృద్ధులు, వికలాంగులు పెన్షన్ డబ్బుల కోసం అష్టకష్టాలు పడేలా చేస్తోంది. ఉదయం నుంచే పెన్షన్ కోసం వృద్ధులు పడిగాపులు పడుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. విజయవాడలో ఫించనుదారులు బ్యాంకుల ముందు క్యూ కట్టారు. ఎండవేడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
వృద్ధులను పొట్టన పెట్టుకుంటారా?- పింఛన్ల పంపిణీలో ప్రభుత్వ తీరు దుర్మార్గం: షర్మిల
ఎన్టీఆర్ జిల్లాతిరువూరులోని స్టేట్‌బ్యాంక్, యూనియన్ బ్యాంక్, సేవా కేంద్రాల వద్ద లబ్ధిదారుల అవస్థలు పడుతున్నారు. నందిగామలో ఓ వైపు భానుడు భగభగ మండుతుంటే మరోవైపు పెన్షన్ కోసం వృద్ధులు బ్యాంకుల వద్ద ఇబ్బంది పడుతున్నారు.
అనకాపల్లి జిల్లానర్సీపట్నంలో ఫించన్‌దారులు అవస్థలు కొనసాగుతున్నాయి. ఎస్బీఐతో పాటు సేవా కేంద్రాల వద్ద లబ్ధిదారులు బారులు తీరారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో చుట్టుపక్కల గ్రామాల నుంచి వృద్ధులు నానా తిప్పలు పడి బ్యాంకుల వద్ద బారులు తీరారు. గంటల కొద్ది క్యూలో నిలబడినా చివరకు ఈ-KYC కాలేదంటూ కొందరికి, పెన్షన్ సొమ్ము జమ కాలేదని మరికొందరిని వెనక్కు పంపుతున్నారు. మరికొందరికి వేలి ముద్రలు పడటం లేదని చెబుతుండటంతో మండుటెండలో వృద్ధులు నీరశించిపోతున్నారు. బ్యాంకుల వద్ద క్యూలో నిలబడినా చివరకు పెన్షన్ అందుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు.