Penna Cement Organization Jagan Extortion: అనంతపురం జిల్లా యాడికి మండలంలో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు ముందే.. భూముల కోసం పెన్నా సిమెంట్స్ యాజమాన్యం చక్రం తిప్పింది. పరిశ్రమ ఏర్పాటుకు మార్కెట్ ధరతో ప్రభుత్వ భూమి బదలాయించాలని.. 2006 ఏప్రిల్ 22న పెన్నా సిమెంట్స్ జనరల్ మేనేజర్.. జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు తాము పట్టా భూములను కొన్నామని, వాటి పక్కనఉన్న కుందనకోట, గుడిపాడు, కమలపాడులో భూమిని కేటాయించాలని కోరింది.
ఎంఆర్వో ముందస్తు సమాచారంతో ఎసైన్డ్ భూములను నామమాత్రపు ధరకే కొట్టేశారు. తాము గుర్తించిన భూములపై నివేదికను కలెక్టర్‌కు సమర్పించాల్సిన ఎంఆర్వో ఎల్లమ్మ.. అందులోని వివరాలను కంపెనీ ప్రతినిధులతో పంచుకున్నారు. దాంతో.. ఎసైన్డ్ భూములున్న రైతులను కలిసిన కంపెనీ ప్రతినిధులు.. సంస్థ కాంపౌండ్ నిర్మిస్తోందని.. పొలాల్లోకి వెళ్లడానికి దారి ఉండదని బెదిరింపులకు దిగారు. ఎకరానికి 20 వేల నుంచి 60 వేల రూపాయల వరకు చెల్లించి.. రైతులతో ఓచర్లపై సంతకాలు తీసుకున్నారు. తర్వాత.. అదే రైతులతో ఆయా భూములు తమకు వద్దని.., స్వాధీనం చేసుకోవాలని అర్థిస్తూ ఎంఆర్వోకు అర్జీలు పెట్టించారు. దాంతో ప్రభుత్వానికి అసైన్డ్ భూముల సేకరణ అవసరం తప్పింది.
ఈ నేపథ్యంలోనే.. తమకు 237 ఎకరాలు కేటాయించాలని ప్రతాప్‌రెడ్డి నేరుగా సీఎం వైఎస్‌కు 2007 డిసెంబర్‌లో లేఖ ఇచ్చారు. ప్రతాప్‌రెడ్డి వినతిని పరిశీలించాలని.. సీఎం కార్యాలయం వెంటనే రెవెన్యూ శాఖకు మెమో పంపుతూ.. సీసీఎల్ఏ, జిల్లా కలెక్టర్లకు సూచనలు చేసింది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల ఆమోదం లేకుండానే.. భూబదలాయింపు ప్రతిపాదనలపై సీసీఎల్ఏ అడిగిన వివరణలను డీఆర్ఓ సుదర్శన్‌రెడ్డి నేరుగా పంపించారు.
ప్రాజెక్టులు, కాంట్రాక్టులే కాదు విద్యుత్ కూడా జగన్ అస్మదీయులకే!- ఏకంగా 47వేల కోట్ల దోపిడీ
పెన్నాకు 231.09 ఎకరాలను.. ఎకరా 50 వేల రూపాయల చొప్పున.. ఎసైన్డ్ చట్ట నిబంధనల ప్రకారం కేటాయించవచ్చని.. 2008 జూన్ 4న సాధికారిక కమిటీ సిఫారసు చేసింది. సీఎం వైఎస్ ఆదేశంతో.. మంత్రివర్గం ఆమోదంతో భూములు కేటాయిస్తూ.. రెవెన్యూశాఖ జీవో జారీ చేసింది. ప్రభుత్వమే కనుక భూములు సేకరించి ఉంటే.. వారికి ఇంకా ఎక్కువ మొత్తంలో పరిహారం అంది ఉండేది. ఈ మేరకు ఆ పేద రైతులకు ఆర్థికంగా నష్టం కలిగింది.
పెన్నాకు సున్నపురాయి లీజుల మంజూరులోనూ వైఎస్ తనదైన శైలిలో దందా నడిపారు. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం బూర్గులలోని కౌలపల్లిలో వెయ్యి 32.31 ఎకరాలలో 20 ఏళ్లపాటు.. సున్నపురాయి గనుల లీజు కోసం 2005 అక్టోబర్ 5న అల్ట్రాటెక్ సిమెంట్ దరఖాస్తు చేసుకుంది. అలాగే.. అక్కడికి సమీపంలోని 47.53 ఎకరాల్లో లీజు కొరుతూ.. 2007 మార్చిలో పీ.లక్ష్మీనారాయణ అనే వ్యక్తి అర్జీ పెట్టుకున్నారు. వీరు దరఖాస్తు చేసుకున్న ప్రాంతాలు కూడా కలిసేలా ఉన్న 800 ఎకరాల్లో ప్రాస్పెక్టింగ్ లైసైన్స్ కోరుతూ పెన్నా సిమెంట్స్ లిమిటెడ్ 2007 జూన్ 4న దరఖాస్తు చేసుకుంది.
దీనిపై భూగర్భ గనుల శాఖ సహాయ డైరెక్టర్ సర్వే నిర్వహించి.. 753 ఎకరాల భూమిని.. పెన్నాకు మూడేళ్ల ప్రాస్పెక్టింగ్ లీజు మంజూరు చేయాలని డైరెక్టర్‌కు సిఫార్సు చేశారు. అల్ట్రాటెక్ మైనింగ్ లీజును తిరస్కరించాలని స్పష్టం చేశారు. అల్ట్రాటెక్ నుంచి ఉపసంహరణ లేఖ లేకుండానే.. అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి పెన్నా లీజును.. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సిఫారసు చేశారు. అల్ట్రాటెక్ నుంచి ఉపసంహరణ లేఖకు పట్టుబట్టకుండానే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమోదించేశారు. మంత్రి అనుమతి లేకుండానే.. పెన్నాకు 304.74 హెక్టార్ల లీజును మంజూరు చేస్తూ.. శ్రీలక్ష్మి 2008 మార్చిలో జీవో ఇచ్చారు.
వేల కోట్ల విలువైన కాంట్రాక్టులన్నీ జగన్ సన్నిహితులకే- స్మార్ట్‌గా దోపిడీ