ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీపీఎస్‌ ద్వారా కొలతలు - పెద్దిరెడ్డి అక్రమ సామ్రాజ్యంపై విచారణ - PEDDIREDDY ENCROACHMENT

పెద్దిరెడ్డి అటవీ భూమి ఆక్రమణపై రంగంలోకి దిగిన జాయింట్ కమిటీ - జీపీఎస్‌ ద్వారా కొలతలు తీసిన టీమ్

Peddireddy Ramachandra Reddy
Peddireddy Ramachandra Reddy (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2025, 6:49 AM IST

Peddireddy Ramachandra Reddy Forest Land Encroachment: చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ ప్రాంతంలో మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు అటవీ భూములను ఆక్రమించిన వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు అధికారులు రంగంలోకి దిగారు. చిత్తూరు కలెక్టర్‌ సుమిత్‌కుమార్, ఎస్పీ మణికంఠ, జేసీ విద్యాధరి, డీఎఫ్‌వో భరణి ఆధ్వర్యంలోని టీమ్​ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధీనంలో ఉన్న భూముల్లో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ సర్వే చేపట్టారు.

అక్కడ మొత్తం ఎంత విస్తీర్ణంలో భూమి ఉందనేదానిపై రెవెన్యూ, అటవీ, సర్వే శాఖల సిబ్బంది జీపీఎస్‌ ఉపయోగించి లెక్కలు వేశారు. దాని ఆధారంగా అందులో అటవీ భూములతో పాటు ఇతర భూములు ఎంత మేర ఉన్నాయనేదానిపై లెక్క తేల్చనున్నారు. ‘అటవీ ప్రాంతంలో మాజీ అటవీశాఖ మంత్రిగారి అక్రమ సామ్రాజ్యం’ హెడ్​లైన్​తో గత నెల 29న ‘ఈనాడు, ఈటీవీ భారత్​'లలో వార్త ప్రచురితమైంది. అందులోని అంశాలపై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు కలెక్టర్, ఎస్పీ, అనంతపురం సీఎఫ్‌లతో జాయింట్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ టీమ్​ విచారణ పూర్తి చేసి, త్వరలోనే ప్రభుత్వానికి రిపోర్టు సమర్పించనుంది.

విలేకరిని బెదిరించిన ఎస్పీ:పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్​ కమిటీ క్షేత్రస్థాయి పర్యటన వార్తను కవరేజ్ చేసేందుకు వెళ్లిన ‘న్యూస్‌టుడే’ విలేకరి అలీమ్‌ బాషాపై చిత్తూరు కలెక్టర్‌ సుమిత్‌కుమార్, ఎస్పీ సీహెచ్‌.మణికంఠ జులుం ప్రదర్శించారు. అక్రమిత భూములున్న ప్రాంతానికి 6 కిలో మీటర్ల దూరంలోనే విలేకరిని అడ్డుకున్నారు. అక్కడి నుంచి ముందుకు వెళ్లటానికి వీల్లేదంటూ హెచ్చరించారు.

అధికారుల వాహనాలను ఫొటోలు తీస్తుండగా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ వెంటనే వాహనం నుంచి దిగి విలేకరి వద్ద నుంచి ఫోన్‌ తీసుకున్నారు. ‘ఇక్కడికి నిన్ను ఎవరు రానిచ్చారు? హెల్మెట్‌ లేదంటూ నీపై కేసు పెడతా’నని ఎస్పీ బెదిరించారు. వైఎస్సార్సీపీ హయాంలో ఈ తరహా దౌర్జన్యాలు చాలానే జరిగాయి. కూటమి ప్రభుత్వంలోనూ కొంతమంది అధికారులు అదే విధంగా వ్యవహరిస్తున్నారు. ‘ఈనాడు’ ప్రతినిధి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లటంతో శుక్రవారం రాత్రి 9.40 గంటల సమయంలో పులిచర్ల తహసీల్దార్‌ ఆఫీస్​ నుంచి ఇద్దరు సిబ్బంది వచ్చి విలేకరి సెల్‌ఫోన్‌ను ఆయనకు అప్పగించారు.

పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్ - విచారణకు కమిటీ ఏర్పాటు

పెద్దిరెడ్డి భూ దోపిడీ - ఆ రోడ్డులో 2.2 కిలోమీటర్లు అటవీ భూమిలోనే!

పెద్దిరెడ్డి భూ దోపిడీ నిజమే - వెబ్‌ల్యాండ్‌ అడంగల్‌లోకి మంగళంపేట భూములు

ABOUT THE AUTHOR

...view details