Peddaiah Gutta Temple History : చుట్టూ దట్టమైన అరణ్యం (అడవి), ఎత్తైన గుట్టలు, కోరిన కోర్కెలు తీర్చే అల్లుబండ, పూజారులు గుట్టపై నుంచి తెచ్చే రకరకాల ధాన్యం, ఆహ్లాద వాతావరణం ఇవీ భక్తులకు కొంగు బంగారంగా విలసిల్లుతున్న పెద్దయ్య - చిన్నయ్య దేవుని విశేషాలు. ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. ఈ ఆలయాన్ని అన్నదాతల గుడిగా భక్తులు పిలుచుకుంటారు. వర్షాకాలం వరి కోతలు మొదలుకొని మళ్లీ యాసంగి పనులు ఊపందుకునే వరకు రైతన్నల సందడి ఉంటుంది. తిరిగి యాసంగి పనులు పూర్తి అయి వానాకాలం ప్రారంభం అయ్యే వరకు కర్షకులతో కిటకిటలాడుతుంది.
మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం నుంచి 8 కిలో మీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో పెద్దయ్య - చిన్నయ్య దేవాలయం ఉంది. ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు ఈ కొండల్లోనే తల దాచుకున్నారని ప్రతీతి. పెద్దయ్య అంటే ధర్మరాజు అందుకే పెద్దయ్య దేవుడిగా, గుట్టను పెద్దయ్య గుట్టగా పిలుస్తారని భక్తులు చెపుతారు. భీముడు గోండుల ఆడపడుచు హిడింబిని వివాహం చేసుకోవడంతో ఈ ప్రదేశాన్ని పెండ్లి మడుగుగా పిలుస్తారని చెబుతారు. అర్జునుని పేర అర్జుగూడ, గుట్టకు కొంత దూరంలో అర్జున లొద్ది నీటి గుండం ఉంది. సహ దేవుని పేర వెలిసిన సామగూడ ఉంది.
తిరుమల భక్తులకు అలర్ట్ - వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ ఎప్పటినుంచంటే!
కాలి నడకన ప్రయాణం : దండేపల్లి నుంచి ఊట్ల వరకు వాహనాలలో వెళ్లడానికి రహదారి ఉంది. కానీ ఆ తరువాత 2 కిలోమీటర్ల మేర అడవిలో కాలినడకన ప్రయాణం చేయాలి. అడవిలో చుట్టూ చెట్లు, రాళ్ల మధ్యలో నుంచి నడవడం ద్వారా కొత్త అనుభూతి పొందుతారు.
పంటలు బాగా పండుతాయని రైతన్నల విశ్వాసం : ప్రతీ ఆదివారం, గురువారాల్లో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి వేలాది మంది వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఇలా చేస్తే చీడలు లేకుండా పంటలు బాగా పండుతాయని రైతన్నలకు విశ్వాసం ఉంది. వానాకాలం ప్రారంభంలో, విత్తనాలు విత్తేటప్పుడు, వరి కోతల సమయంలో అన్నదాతలు అధిక సంఖ్యలో దేవాలయానికి వస్తుంటారు. దేవుడు వెలిసిన ఈ గుడిని ఇల్లారి అని పిలుస్తారు.