PCB REVEALS HUSSAIN SAGAR DETAILS :భాగ్యనగరంలో వినాయక విగ్రహాల నిమజ్జన సమయంలో హుస్సేన్ సాగర్‌లో విపరీతమైన నీటి కాలుష్యం నమోదైందని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) స్పష్టం చేసింది. లేపాక్షి హ్యాండిక్రాఫ్ట్స్ వైపు ఐదు ప్రాంతాల్లో క్రోమియం అధిక మోతాదులో ఉన్నట్లు నిర్ధారించింది. గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి ముందు, తర్వాత సాగర్ చుట్టుపక్కల ఆరు ప్రాంతాల్లో నీటి నాణ్యతను టెస్ట్ చేసిన పీసీబీ తాజాగా ఫలితాలను విడుదల చేసింది.
నెక్లెస్‌రోడ్, బుద్ధ విగ్రహం, లేపాక్షి హ్యాండిక్రాఫ్ట్స్, ఎన్టీఆర్ పార్కు వద్ద రెండు చోట్ల, లుంబినీ పార్కు సమీపంలో అనేక నమునాలను సేకరించిన అధికారులు ల్యాబ్‌కు పంపించారు. నీటిలోని టీడీఎస్(టోటల్ డిజాల్వుడ్ సాలిడ్స్), టీఎస్‌ఎస్(టోటల్ సస్పెండెడ్ సాలిడ్స్), సీవోడీ(కెమికల్ ఆక్సిజన్ డిమాండ్), డీవో(డిజాల్వుడ్ ఆక్సిజన్), బీవోడీ(బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్), టోటల్ కొలిఫామ్, ఫీకల్ కొలిఫామ్ స్థాయులు ఎలా ఉన్నాయో వెల్లడించారు.
నమోదయిన వివరాలు : సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనం వేళ అన్ని చోట్ల టీఎస్‌ఎస్(టోటల్ సస్పెండెడ్ సాలిడ్స్)- నీటి అడుగున చేరే మలినాలు, టర్బిడిటీ అధిక మోతాదులో ఉంది. తర్వాత తగ్గినా, నిమజ్జనం ముందున్న స్థాయికి మాత్రం చేరుకోలేదు. బుద్ధ విగ్రహం, ఎన్టీఆర్ పార్కు, లుంబినీ పార్కు వద్ద అత్యధిక మోతాదులో టీడీఎస్(టోటల్ డిజాల్వుడ్ సాలిడ్స్) నమోదైంది. దీంతో చర్మ సంబంధ దుద్దుర్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి.