Pawan Kalyan Prayaschitta Diksha :తిరుమల లడ్డూలో కల్తీ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష కొనసాగుతోంది. దీనిలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలో పవన్ కల్యాణ్ శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పవన్‌కు ఆలయ మర్యాదలతో అర్చకులు, ఆలయ ఈవో రామారావు, దేవదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ ఘన స్వాగతం పలికారు. ముందుగా ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో మెట్లను పవన్ కల్యాణ్ శుభ్రం చేశారు. ఆ తర్వాత మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య మెట్ల పూజ చేశారు. అనంతరం కనకదుర్గమ్మను జనసేనాని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ హెచ్చరిక : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై డిప్యూటీ సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ పాలనలో ఆలయాల్లో తప్పు జరిగిందని చెబితే అపహాస్యం చేసేవారని అన్నారు. అపవిత్రం జరిగినప్పుడు బాధ్యత ఉన్న వ్యక్తులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
తోటి హిందువులను దూషించడం మంచిది కాదు :ధర్మారెడ్డి ఎక్కడ కనిపించట్లేదని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. తిరుమలను ఇష్టారాజ్యంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం పాటించేవాళ్లు ఇతర మతాలను గౌరవిస్తారని అన్నారు. సగటు హిందువుకు వేరే మతం, వ్యక్తిపై ద్వేషం ఉండదని వెల్లడించారు. సాటి హిందువులు, తోటి హిందువులను దూషించడం మంచిది కాదని సూచించారు. సనాతన ధర్మంపై పోరాటం చేయగలిగితే తనను ఎవ్వరూ ఆపలేరని అన్నారు. ఈ నేల అన్ని మతాలను గౌరవించేదని, ధర్మానికి విఘాతం కలిగినప్పుడు అందరూ మాట్లాడాలని పిలుపునిచ్చారు.