Pawan Kalyan Announces Financial Assistance:గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి తిరిగి వెళ్తోన్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు మృతి చెందారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నటుడు రామ్ చరణ్, నిర్మాత దిల్రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించారు.
జనసేన తరుపున ఆర్థికసాయం: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుక నుంచి ఇళ్లకు వెళ్తున్న సమయంలో ఏడీబీ రోడ్డుపై చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారని తెలిసి ఆవేదనకు లోనయ్యానని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ కాకినాడ–రాజమహేంద్రవరం వెళ్లే ఏడీబీ రహదారి విస్తరణను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏడీబీ రోడ్డు పనులు చేపట్టిందని ఈ దశలో ప్రమదాం జరగడం బాధాకరమన్నారు.
ఇళ్లకు సురక్షితంగా వెళ్లండి అని ఆరోజు వేడుకలో ఒకటికి, రెండుసార్లు చెప్పానని కాని ఇలా జరగడం చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఆర్థికసాయం అందిస్తామని అలానే ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించే ఏర్పాట్లు చేయాలని, తన కార్యాలయ అధికారులకు ఆదేశారు జారీ చేశారు. ఇకపై పిఠాపురం నియోజకవర్గ పర్యటనలకు ఏడీబీ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగించాలని నిర్ణయించుకున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఎక్స్(X)లో ట్వీట్ చేశారు.
రామ్ చరణ్, దిల్రాజు సంతాపం: ఇద్దరు అభిమానుల మృతికి రామ్‌చరణ్ సంతాపం తెలిపారు. చనిపోయిన ఆ ఇద్దరు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. రాజమండ్రిలో జరిగిన ఈవెంట్ తర్వాత ఇద్దరు మృతి చెందడం బాధాకరమని నిర్మాత దిల్ రాజు అన్నారు. ఈవెంట్ తర్వాత ఇద్దరి మరణం తెలిసి చాలా బాధ పడుతున్నానని తెలిపారు. బాధిత కుటుంబాలను తనా వంతుగా ఆదుకుంటానని అన్నారు. మృతుల కుటుంబాలకు చెరో రూ.5 లక్షలు అందిస్తానని దిల్ రాజు అన్నారు.