Pavani Sai Excelling in Taekwondo in Vijayawada :యుద్ధ కళల్లో తైక్వాండోది ప్రత్యేక స్థానం. అలాంటి విద్యలో అదరగొడుతోందా అమ్మాయి. ఆర్థిక పరిస్థితులు అడ్డువచ్చినా అయినా వాళ్లను కోల్పోయినా అధైర్య పడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. చదువుల్లో రాణిస్తూనే ఎంచుకున్నక్రీడలో పతకాలూ సాధిస్తోంది. పేదరికం ప్రతిభకు అడ్డు కాదని చాటుతూ ప్రశంసలు అందుకుంటోంది తెలుగమ్మాయి పావని సాయి.
తండ్రి ప్రోత్సాహంతో :తైక్వాండో ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసం కల్పించే యుద్ధవిద్య. ఈ ఆటలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తోంది ఈ అమ్మాయి. చిన్నవయసులో నాన్న ఇచ్చిన ప్రోత్సాహంతో కెరీర్ మెుదలు పెట్టింది. ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పెట్టినా ధైర్యంగా ముందుకు సాగింది. క్రమం తప్పకుండా సాధన చేసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తోంది ఈ యువ క్రీడాకారిణి. ఈ అమ్మాయి పేరు సంపతి పావని సాయి.
విజయవాడ మేరీస్ స్టెల్లా కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో తైక్వాండోపై మక్కువ పెంచుకుంది. అలా చిన్ననాడే క్రీడల వైపు అడుగులేసి మెళకువలు నేర్చుకుంది. కానీ, అనారోగ్యంతో తండ్రి మరణించడంతో కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు మెుదలయ్యాయి. దాంతో కొన్నాళ్లు ఆటలకు దూరంగా ఉన్నానని చెబుతోంది.
హాబీతో ప్రత్యేకత చాటుకున్న యువకుడు - నాణేల సేకరణతో అంతర్జాతీయ రికార్డులు - RAVITEJA COINS COLLECTIN
"మా నాన్న ప్రోత్సాహంతోనే రెండో తరగతి నుంచి తైక్వాండోను నేర్చుకుంటున్నాను. కొన్ని ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొంత కాలం వరకు తైక్వాండోకు దూరంగా ఉన్నాను. మా అమ్మ, కోచ్ సహాయంతో మళ్లీ తైక్వాండో ప్రాక్టీస్ చేస్తున్నాను. నేషనల్ చాంపియన్‌షిప్ పోటీల్లో కాంస్యం, రజత పతకాలు సాధించాను. అంతర్జాతీయ తైక్వాండో పోటిల్లో పాల్గొనాలని సాధన చేస్తున్నాను"_పావని సాయి, తైక్వాండో క్రీడాకారిణి
జాతీయ పోటీలకు అర్హత :పావని తల్లి అపర్ణ విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నారు. తల్లి ప్రోత్సాహంతో సాధన చేసి రాష్ట్రస్థాయి అండర్-11 బాలికల విభాగంలో కాంస్యం సాధించింది పావని. 2019లో విశాఖ వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి పూమ్‌సే విభాగంలో పసిడి పతకం కైవసం చేసుకుంది. అనంతరం జాతీయ పోటీలకు అర్హత పొందినా ఆర్ధిక ఇబ్బందులతో వెళ్లలేకపోయింది ఈ క్రీడాకారిణి. ఆటపై ఇష్టంతో గతేడాది తిరిగి సాధన ప్రారంభించింది పావని.