Patnam Narender Reddy Bail Petition :వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ప్రభుత్వాధికారులపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మరో వైపు పట్నం నరేందర్ రెడ్డి సైతం తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై సోమవారం న్యాయస్థానంలో విచారణ జరగనుంది.
నరేందర్ రెడ్డిని కస్టడీకి కోరిన పోలీసులు :కలకలం సృష్టించిన లగచర్ల ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి నిన్న రిమాండ్‌కు తరలించారు. ఏ2గా ఉన్న బోగమోని సురేష్ కోసం పోలీసులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు. అరెస్ట్ సమయంలో అతని ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నరేందర్ రెడ్డి : ఫోన్ కాల్ డేటాని విశ్లేషించేందుకు, నరేందర్ రెడ్డిని కేసుపై మరింత విచారిచేందుకు అతన్ని కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ఆయనను ఏడు రోజుల కస్టడీకి కోరుతూ వికారాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు వికారాబాద్ కోర్టులో పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై కోర్టు సోమవారం విచారణ జరపనుంది.
ఏ ఒక్క పోలీసు అధికారి నా స్టేట్‌మెంట్ తీసుకోలేదు : ఇదిలా ఉండగా చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని న్యాయవాదులు కలిశారు. వారి ద్వారా కోర్టుకు నరేందర్ రెడ్డి అఫిడవిట్ పంపారు. అందులో పలు అంశాలను ప్రస్తావించారు. నిన్న ఉదయం కేబిఆర్ పార్కు వద్ద మార్నింగ్ వాక్ సమయంలో తనని పోలీసులు అరెస్ట్ చేశారని బలవంతంగా కారులో ఎక్కించి వికారాబాద్ డీటీసీకి తీసుకొచ్చారని అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్నారు. ఏ ఒక్క పోలీసు అధికారి తన స్టేట్మెంట్ తీసుకోలేదని కోర్టులో హాజరుపరిచే 10 నిమిషాల ముందు పేపర్లపై తన సంతకం తీసుకున్నారన్నారని నరేందర్ రెడ్డి ఆరోపించారు.