Patients Facing Problems With Lack Of Facilities in Nellore GGH : నెల్లూరు జీజీహెచ్ ఆసుపత్రిలో ఎక్కడ చూసిన సమస్యలే దర్శనమిస్తున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా స్వచ్ఛతకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు, వారి సహాయకులకు కనీస సౌకర్యాలు ఉండటం లేదు. ఆసుపత్రి బయట మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్వహణ లోపంతో చెత్త పేరుకుపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని రోగుల సహాయకులు వాపోతున్నారు. నెల్లూరు జీజీహెచ్ కి వస్తే కొత్తరోగాలు వస్తాయని బాధితులు చెబుతున్నారు.
Audio viral: నెల్లూరు జీజీహెచ్‌లో లైంగిక వేధింపులు..సూపరింటెండెంట్ బదిలీ
సమస్యలకు నిలయంగా మారిన నెల్లూరు జీజీహెచ్ :నెల్లూరు నగరం నడిబొడ్డులోని జీజీహెచ్ వైద్యశాల సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ప్రతి రోజు వందలాది మంది రోగులు వైద్యం కోసం నెల్లూరు, కడప, ప్రకాశం, తిరుపతి జిల్లాల నుంచి వస్తుంటారు. ఆస్పత్రిలో అధునాతన పరికరాలతో ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. సుమారు వందమంది సిబ్బందికి పైగా ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఇవన్నీ చెప్పుకునేందుకు బాగానే ఉన్నప్పటికీ ఆసుపత్రితోపాటు పరిసర ప్రాంతాలు అశుభ్రతతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. రోగుల సహాయకులు కోసం నిర్మించిన ప్రత్యేక షెడ్డు మరుగుదొడ్లు అశుభ్రంగా తయారయ్యాయి. వసతుల లేమితో ఆరుబయట అవస్థలు పడుతున్నామని రోగుల సహాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిర్వహణ లోపంతో ఆసుపత్రిలో పేరుకుపోయిన చెత్త :రోగులకు అవసరమైన మందులు, కొన్ని వైద్య పరీక్షలు నెల్లూరు జీజీహెచ్‌లో అందుబాటులో లేవని రోగుల సహాయకులు చెబుతున్నారు. సరైన వసతి సదుపాయాలు లేకపోవటంతో ఆసుపత్రి ఆవరణలోని చెట్లకిందే ఉంటున్నారు. నిర్వహణ లోపంతో చెత్త పేరుకుపోయి తీవ్ర దుర్వాసనతో అవస్థలు పడుతున్నామన్నారు. నెల్లూరు జీజీహెచ్‌కి వస్తే కొత్తరోగాలు వస్తాయని బాధితులు చెబుతున్నారు.