Patancheru MLA Brother Arrested : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Patancheru MLA Mahipal Reddy) సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని అక్రమ మైనింగ్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఆయన నివాసానికి వచ్చిన పోలీసులు అరెస్టు చేసి పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
MLA Mahipal Reddy Brother Arrest :లక్డారం గ్రామంలో మధసూదన్ రెడ్డి సంతోష్ గ్రానైట్ మైనింగ్ పేరుతో క్రషర్ కంపెనీలు నిర్వహిస్తున్నారు. అయితే కేంద్ర పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి పరిమితికి మించి తవ్వకాలు జరిపారని, అదే విధంగా అనుమతుల గడువు పూర్తయినా మైనింగ్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇటీవల క్వారీని అధికారులు సీజ్ చేశారు. దీనిపై తాజాగా తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మధుసూదన్ రెడ్డిపై అక్రమ మైనింగ్, చీటింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. క్రషర్లను సీజ్ చేశారు.
మధుసూదన్ రెడ్డిని (Madhusudan Reddy Arrested) అరెస్టు చేశారనే విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు ఆయణ్ను వైద్య పరీక్షల కోసం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా గులాబీ శ్రేణులు అడ్డుకున్నారు. పోలీసులు వారి నిలువరించి అక్కడి నుంచి మధుసూదన్ రెడ్డిని సంగారెడ్డికి తరలించారు.
సంగారెడ్డి ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత :మరోవైపు సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్కడికి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఆసుపత్రిలోకి వెళ్లేందుకు వారు యత్నించారు. పోలీసులు ఆసుపత్రి ప్రధాన గేటును మూసివేశారు. తమను లోపలికి అనుమతించాలని గులాబీ శ్రేణులు నినాదాలు చేశారు. అత్యవసర విభాగంలో మధుసూదన్ రెడ్డికి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.