Parents Remarried for Baby :ఆ జంటకు ఇది వరకే వివాహమైంది. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్ చేసుకుంది. అమ్మాయి మైనర్ అని పోలీసులకు తెలియడంతో భర్తను అరెస్ట్ చేశారు. ఆమె అప్పటికే గర్బిణి. ఈ క్రమంలోనే ఓ పాపకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఆ చిన్నారిని శిశుగృహకు అప్పగించారు. అలా ఆ చిన్నారి అమ్మ ప్రేమతో తండ్రి లాలనకూ దూరమైంది. ఇలా ఆ బాలిక అందరూ ఉన్నా ఓ అనాథలా మారింది. చట్టం తన పని తాను చేసుకుపోయే క్రమంలో ఈ వ్యవహారం చోటుచేసుకుంది.
కానీ చివరికి ఏడాది పాటు అక్కడే పెరిగి కలెక్టర్ చొరవతో తిరిగి అమ్మ ఒడికి చేరుకుంది ఆ చిన్నారి. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలానికి చెందిన భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తికి నందినితో 2022లో వివాహం జరిగింది. అప్పటికే గర్భం దాల్చిన నందిని మైనర్ అనే విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
ఈ క్రమంలోనే నందిని 2023లో ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఆ చిన్నారిని అధికారులు శిశుగృహకు అప్పగించారు. ఇలా ఆ పసికందు తల్లిదండ్రులకు దూరమైంది. పాప తల్లి ప్రస్తుతం మేజర్ కావడంతో భాస్కర్‌రెడ్డి ఆమెను చట్టప్రకారం మళ్లీ పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఆ భార్యాభర్తలు తమ చిన్నారిని తమకు అప్పగించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియాను కోరారు. ఇందుకు అంగీకరించిన కలెక్టర్ సోమవారం నాడు దంపతులకు ఆ పాపను అప్పగించారు.