Panchayati Raj JE Suicide due to YSRCP Leaders Harassment: కొండలు, గుట్టల్నే కాదు, సిమెంట్‌ను సైతం అధికార వైసీపీ నాయకులు బొక్కేస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ నిధులతో గ్రామాల్లో చేస్తున్న భవన నిర్మాణాలకు వైఎస్సార్ నిర్మాణ్ పేరిట ప్రభుత్వం వివిధ కంపెనీల నుంచి సిమెంట్ సరఫరా చేసింది. నిల్వ చేసేందుకు గ్రామాల్లో తగిన సౌకర్యం ఉందా లేదా అనే విషయాన్ని పట్టించుకోకుండా వందల టన్నుల్లో సిమెంట్ బస్తాల్ని పంపింది.
భవన నిర్మాణాలకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో పనులు అక్కడే నిలిచిపోయాయి. సిమెంట్ బస్తాలు సకాలంలో వినియోగించక పోవడం వలన కొన్నిచోట్ల గట్టి పడటం మొదలైంది. ఈ తరుణంలో మండల, గ్రామ స్థాయి వైసీపీ నాయకులు ఇతర కాంట్రాక్టు పనులకు ఆ సిమెంట్‌ను వాడుకున్నారు. అవసరమైనప్పుడు తిరిగిస్తామని చెప్పడంతో ఇంజినీర్లూ కాదనలేదు. గత ఏడాదిన్నరలో నిర్మాణం పూర్తైన కొన్ని భవనాలకు తుది బిల్లుల చెల్లింపులకు ఆన్‌లైన్‌లో మండల ఇంజినీర్లు వివరాలు అప్ లోడ్ చేస్తున్నారు.
తిరిగి ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతో: ఆ సమయంలో ప్రభుత్వం సరఫరా చేసిన సిమెంట్ లెక్కలు చూపాల్సి వస్తోంది. భవన నిర్మాణానికి సరఫరా చేసిన సిమెంట్ బస్తాలెన్ని, వీటిలో వినియోగించనివి ఎన్ని, మిగిలిన బస్తాల వివరాలు, బిల్లులు సహా అప్లోడ్ చేయాలి. మిగులు బస్తాలకు సంబంధించిన నిల్వలను అధికారులకు చూపించాలి. తిరిగి ఇస్తామని చెప్పి సిమెంట్ను తీసుకెళ్లిన వైసీపీ నాయకులు ఇవ్వకపోవడంతో ఇంజినీర్ల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
వైసీపీ కౌన్సిలర్ వేధిస్తున్నారని అటెండర్ ఆత్మహత్యాయత్నం - సెల్ఫీ వీడియో
సిమెంట్ తిరిగి ఇవ్వకపోగా ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం, అనంతపురం, నెల్లూరు, కర్నూలు, కృష్ణా, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల వైసీపీ నాయకులు ఇంజినీర్లపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. మరోసారి అడిగితే ఫిర్యాదులు చేస్తామని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. ఇటు నాయకులు మోసం, అటు ఉన్నతాధికారుల నుంచి సిమెంట్ లెక్కలు చెప్పాలన్న ఒత్తిడి ఎక్కువ కావడంతో ఇంజినీర్లు మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
వైసీపీ నాయకుల మోసం, అధికారుల ఒత్తిళ్ల కారణంగా విజయనగరం జిల్లా రాజాం పంచాయతీరాజ్ శాఖ సబ్‌డివిజన్ కార్యాలయంలోనే రేగిడి మండల ఇన్చార్జి జేఈ రామకృష్ణ ఫ్యాన్‌కు ఉరేసుకున్నారు. రేగిడి మండలంలో భవనాల పనుల కోసం రెండు సంవత్సరాల కిందట 10 వేల బస్తాల సిమెంటును ప్రభుత్వం సరఫరా చేసింది. భవనాల పనులు ప్రారంభించిన గుత్తేదారులకు సకాలంలో బిల్లులు మంజూరు కాలేదు. వారు పనుల్ని మధ్యలోనే నిలిపేశారు.
సిమెంట్ బస్తాలు గడ్డకట్టి పాడైపోతాయనే భయంతో అధికారులు ఇతర పనులకు ఎక్కడికక్కడ దాన్ని సర్దుబాటు చేశారు. పలువురు వైసీపీ నాయకులు సిమెంటు తీసుకుని, వాడుకున్నారు. తర్వాత భవనాల పనులకు సంబంధించిన బిల్లులు రావడంతో గుత్తేదారులు మళ్లీ పనులు మొదలు పెట్టారు. తమకు సిమెంటు కేటాయించాలని కోరారు. సిమెంట్‌ను వాడుకున్న వైసీపీ నాయకులు తిరిగి ఇవ్వలేదు. మరోపక్క సిమెంట్‌కు సంబంధించిన లెక్కలు చెప్పాలంటూ జేఈ రామకృష్ణను బాధ్యుడిని చేస్తూ అధికారులు ఒత్తిడి పెంచారు.