Panchayat Secretary Harasses Woman: అక్కడ, ఇక్కడ కాదు ఎక్కడైనా మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు కొంతమంది మృగాళ్లు రెచ్చిపోతున్నారు. అవసరం కోసం బయటకు వచ్చిన మహిళలను లోబరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా అలాంటి వారి ఆలోచనల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇలాంటి ఘటనలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. కొంతమంది ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి.
డెత్ సర్టిఫికెట్ కావాలంటే నా కోరిక తీర్చాల్సిందే. ఇది ఎక్కడో కాదు నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో ఘటన. గిరిజన మహిళను 3 నెలలుగా వేధిస్తున్న ఘటన ఇది. పంచాయతీ కార్యదర్శి వేధింపులు తాళలేక వీడియో రికార్డు చేసి అధికారులకు చూపించి న్యాయం చేయమని బాధితురాలు కోరారు. ఈ క్రమంలో నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్కి బాధితురాలు ఫిర్యాదు చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని రాపూరు మండలం కోడూరుపాడు గ్రామానికి చెందిన కాలనీకి చెందిన మల్లిక నాగలక్ష్మి తండ్రి అయిన శంకరయ్య డెత్ సర్టిఫికెట్ అడిగితే శారీరకంగా తన కోరిక తీర్చాలని రాపూరు పంచాయతీ కార్యదర్శి చెంచయ్య వేధిస్తున్నాడని బాధితులు వాపోయారు. సర్టిఫికెట్ అడిగితే అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నాడని పర్సనల్గా వచ్చి మాట్లాడమని పదే పదే వేధించేవాడని బాధిత మహిళ వాపోయారు.
కోరిక తీరిస్తే నిమిషాల వ్యవధిలో సర్టిఫికెట్: ఫోన్ చేసి శారీరకంగా తన కోరిక తీరిస్తే నిమిషాల వ్యవధిలో సర్టిఫికెట్ ఇస్తానని చెప్పేవాడని తెలిపారు. చివరకు ఎన్నిసార్లు ప్రాధేయపడినా నన్ను వీడియో కాల్లో చూడాలని చాలా ఇబ్బంది పెడుతున్నాడని వివరించారు. గూడూరులోని, మాలవ్యనగర్ నందు డబుల్ బెడ్రూం ఉందని అక్కడకు రావాలని అడుగుతున్నాడని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అతనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
"మనుషులున్నారు జాగ్రత్త!" - రోడ్డుపైకి రావడమే తను చేసిన పాపం!