Padma Shri was Awarded to Miriyala Apparao :'వినరా భారత వీరకుమారా విజయం మనదేరా!' అంటూ సాగేదే బుర్రకథ. ఇదొక జానపద కళారూపం. బుర్రకథ పల్లెపదాలు, హాస్యాలు, బిగువైన కథనాలు, పద్యాలు, పాటలు అన్నింటినీ కలుపుకొంటూ సరదాగా సాగిపోయే ఓ అద్భుతమైన కళారూపం. పరిమితమైన ఆహార్యంతో, ఆడుతూ పాడుతూ హాస్యోక్తులు పలుకుతూ జనాలకు చేరువగా వెళ్లే కళారూపాలలో హరికథ మొదటిది అయితే బుర్రకథ రెండవ స్థానంలో ఉంటుంది. ఇంతటి అద్భుతమైన కళారూపాన్ని తెలుగు నేలపై ఐదు దశాబ్దాలు ప్రదర్శించిన ఘనత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలేనికి చెందిన కళాకారుడు మిరియాల అప్పారావు(76) సొంతం. ఐదు వేలకు పైగా ప్రదర్శనలిచ్చి తెలుగు జానపద కళకు ఊపిరులూదిన ఆయనకు కేంద్రం పద్మశ్రీ ప్రకటించింది. గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న అప్పారావు ఇటీవల కన్నుమూశారు. ఆయన పెద్దకార్యం శనివారం కోనసీమ జిల్లా రావులపాలెంలో నిర్వహించారు. ఆ రోజునే పద్మశ్రీ పురస్కార ప్రకటన వెలువడింది.
మిరియాల అప్పారావుకు తాడేపల్లిగూడెంతో అనుబంధం ఉంది. దీంతో స్థానికులు ఆయనతో అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అప్పట్లోనే అక్షరాస్యత, బాల్య వివాహాలపై బుర్రకథల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపేవారని గుర్తు చేసుకుంటున్నారు. స్వస్థలం రావులపాలెం అయినప్పటికీ భార్య చనిపోయిన తర్వాత తాడేపల్లిగూడెం పట్టణంలోని చిన్న కుమార్తె శ్రీదేవి వద్ద నాలుగేళ్ల పాటు ఉన్నారు. వయసు రీత్యా అనారోగ్యంగా ఉండటంతో కొన్ని రోజుల కిందట స్వస్థలం రావులపాలెం తీసుకెళ్లారు. అక్కడే ఆయన తుది శ్వాస విడిచారు.