Owner Complaint to CID about Illegal Mining of Quartz Mines : అధికారాన్ని అడ్డంపెట్టుకుని నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు మైనింగ్‌లో ఇష్టారీతిన దోపిడీకి పాల్పడ్డారని ఓ మైనింగ్ యజమాని ఆరోపించారు. అన్ని అనుమతులు ఉన్న తన భూముల్ని లాగేసుకుని మైనింగ్ చేసి వేలకోట్ల క్వార్జ్‌ను విదేశాలకు తరలించారని నెల్లూరు సీఐడీ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో పాటు స్థానిక వైసీపీ నేతలు దోపిడీ వెనక ఉన్నారని ఫిర్యాదులో ఆరోపించారు.
'మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పంలోనే పుడతా'- నియోజకవర్గానికి సీఎం చంద్రబాబు వరాల జల్లు
నెల్లూరు జిల్లాలో గత ఐదేళ్లలో అధికారం అండతో చెలరేగిపోయిన వైసీపీ మైనింగ్ మాఫియా అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. వైసీపీ పెద్దల వేధింపులకు గురయ్యానని సైదాపురానికి చెందిన బద్రీనాథ్ అనే క్వార్జ్ గనుల యజమాని సీఐడీ డీఎస్పీకి అక్రమాలకు సంబంధించిన వివరాలను సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేశారు. తమ పేరిట ఉన్న గనుల్లో వైసీపీ నాయకులు దౌర్జన్యంగా తవ్వకాలు జరిపి మట్టి, ఖనిజాన్ని తరలించారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో కొంతమంది అధికార బలంతో మైనింగ్‌ను అక్రమంగా చేజిక్కించుకున్నారని తెలిపారు. ఈ ఖనిజాన్ని విదేశాలకు భారీగా తరలించారని సాక్ష్యాధారాలతో దస్త్రాలను అధికారులకు సమర్పించారు.
అలాగే లక్ష 50వేల టన్నుల క్వార్జ్ రాయిని తవ్వేసి దాదాపు 500 నుంచి 800కోట్ల రూపాయలు దోపిడి చేశారని ఆరోపించారు. ఇదంతా సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో పాటు స్థానిక వైసీపీ నేతలు దౌర్జన్యాలు చేసి రెండేళ్లుగా కోట్ల రుపాయల మేర క్వార్జ్‌ని తవ్వేశారని ఆరోపించారు. ఇదేంటని నిలదీస్తే కేసులు పెడుతామని బెదిరించినట్లు తెలిపారు. దీనిపై హైకోర్టులో కేసు వేసినప్పటికీ కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి అక్రమంగా తవ్వకాలు జరిపారని ఆరోపించారు. ఇప్పటికైన వారిపై చర్యలు తీసుకోవాలని క్వార్జ్ గనుల యజమాని డిమాండ్ చేశారు.