ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆడిపాడే వయసులో అనాథలుగా మారిన చిన్నారులు - పూట గడవని స్థితిలో దుర్భర జీవితం - Orphan Children Waiting for Help - ORPHAN CHILDREN WAITING FOR HELP

Orphan Children Waiting for Help: లోకం తెలియని వయసు. చదువుతో పాటు ఆడుతూ పాడుతూ గడపాల్సిన పిల్లలు. కానీ విధి వెక్కిరించింది. ఆలనా పాలనా చూడాల్సిన అమ్మ, అండగా ఉండాల్సిన నాన్న దూరమయ్యారు. నా అన్నవాళ్లు లేక పట్టించుకునే దిక్కు లేక నలుగురు చిన్నారులు అనాథలయ్యారు. ఎవరు ఆదుకుంటారా అని ఎదురుచూస్తున్న పిల్లల దీనగాథ ఇది.

orphans waiting for help
orphans waiting for help (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 27, 2024, 2:32 PM IST

ఆడిపాడే వయసులో అనాథలుగా మారిన చిన్నారులు- పూట గడవని స్థితిలో దుర్భర జీవితం (ETV Bharat)

Orphan Children Waiting for Help: ఏ కష్టమొచ్చినా చెప్పుకునేందుకు తల్లిదండ్రులు లేరు. ఆకలైతే అడగ్గానే పెట్టడానికి ఎవరూ లేరు. తల్లిదండ్రులు లేక, అయినవారు కానరాక నలుగురు చిన్నారులు దిక్కులేని వారయ్యారు. రోడ్డు పక్కనే ఉన్న చిన్న గుడిసెలో ఉంటూ ఆదుకునే వారి కోసం ఎదురు చూస్తున్నారు. సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్​ పక్కన శివారు పొలాల్లో చిన్నపాటి గుడిసే వేసుకుని చౌడమ్మ, అంజి దంపతులు నివసించేవారు. ప్లాస్టిక్​ వ్యర్థాలు సేకరిస్తూ 20 ఏళ్ల నుంచి అక్కడే జీవనం కొనసాగించారు.

వీరికి నలుగురు పిల్లలు. అందులో పదేళ్ల శేఖర్​, ఎనిమిదేళ్ల లక్ష్మి, ఆరేళ్ల అమ్మలు, నాలుగేళ్ల ముత్యాలు ఉన్నారు. ఏ రోజుకారోజు కష్టపడుతూ వచ్చిన దాంట్లో సర్దుకుంటూ బతుకుతున్న వారి జీవితాల్లో అనుకోని సంఘటన జరిగింది. రెండేళ్ల క్రితం ఇంటి పెద్ద అనారోగ్యంతో కన్నుమూశాడు. తల్లే కష్టపడుతూ పిల్లలను పెంచింది. కానీ మళ్లీ ఆ కుటుంబంపై విధి పగబట్టింది. ఆ తల్లి కూడా అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఆ నలుగురు పిల్లలు రోడ్డున పడ్డారు. దీంతో ఆ చిన్నారుల భవిష్యత్​ ప్రశ్నార్థకంగా మారింది.

అనాథలకు అండగా న్యాయవాది పుట్టపర్తి ప్రభాకర్ రెడ్డి కుటుంబం

చందాలు వేసుకుని: కనీసం ఈ నిరుపేద కుటుంబానికి రేషన్‌ కార్డు కూడా లేదు. చుట్టు పక్కల గుడారాల్లో నివసిస్తున్నవారు చందాలు వేసుకుని పది రోజుల కిందట మృతి చెందిన చౌడమ్మ దిన కార్యక్రమం నిర్వహించారు. పరిసరాల్లోని ఇరుగు పొరుగువారు పది రోజులుగా పిల్లల ఆకలి తీరుస్తున్నారు. గతంలో తల్లిదండ్రులు ప్లాస్టిక్‌ వ్యర్థాలు సేకరించి పిల్లలను పోషించేవారు. ప్రస్తుతం నా అన్నవారు లేకపోవడంతో ఆకలి తీరడానికి యాచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సాయం కోసం ఎదురుచూపులు: ఆడిపాడాల్సిన వయసులో ఈ పూట ఎవరు అన్నం పెడతారా అని ఎదురుచూసే బాల్యం వారిది. ఎవరూ పట్టించుకోకపోతే పస్తులుండాల్సిన పరిస్థితి. ప్రేమతో లాలించడానికి అమ్మ లేదు, బాధ్యతలు చూడటానికి తండ్రీ లేడు. అనాథ పిల్లల గురించి తెలుసుకున్న నల్లమాడకు చెందిన కృష్ణ సుమన్‌రెడ్డి అనాథ పిల్లలకు సాయం అందించారు.

"మా అమ్మానాన్న ఇద్దరూ చనిపోయారు. నాకు ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. మాకు తినేందుకు కూడా తిండి లేదు. మేం ఉంటున్న గుడిసె కూడా వర్షం వస్తే కారిపోతోంది. నాకు చదువుకోవాలని ఉంది. ఎవరైనా దాతలు మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాను."- శేఖర్, పెద్ద కుమారుడు

పెద్ద మనసుతో : హైదరాబాద్‌లో ఉంటున్న దాత రూ.10 వేల విలువైన దుస్తులు, ఇంటి సామగ్రిని సమకూర్చారు. దాత ప్రతినిధులు అంజి, చిన్నా నాయక్, స్థానిక పోలీసు సిబ్బందితో కలిసి పిల్లలకు దుస్తులు అందించారు. తల్లిదండ్రుల మృతితో అనాథలుగా మారిన పిల్లలు నిరాదరణతో పెడదారి పట్టకుండా మానవతా వాదులెవరైనా ముందుకు వచ్చి భవిష్యత్తును అందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఈ చిన్నారులకు ఓ దారి చూపించి ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

'అనాథల అక్రమ దత్తతలపై చర్యలు తీసుకోండి'

ABOUT THE AUTHOR

...view details