Organ Donation Awareness: అవయవ దానంతో ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. అవయవ దానంపై చాలామంది అపోహలు వీడితే ఎందరికో పునర్జన్మ ప్రసాదించవచ్చని జీవన్‌దాన్ ఇన్ఛార్జ్ డా.రాంబాబు అంటున్నారు. అవగాహనతో అవయవదానానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుతున్నారు.
మనిషి మరణిస్తే తిరిగి రారని బాధపడతాం, మరణిస్తున్న మనిషి 8 మందికి జీవితాన్ని ఇవ్వొచ్చని జీవన్ దాన్ ట్రస్ట్ నిరూపిస్తుంది. అవయవ దానంపై అందరూ అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 900 మందికి అవయవదానం చేశామని ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు. ఆర్గాన్ డొనేషన్‌పై అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.
వేల మంది రోగులు తమకు అవసరమైన అవయవాలు సరైన సమయంలో లభించకపోవటంతో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి రక్తదానం చేసే విధంగానే ప్రతి ఒక్కరూ అవయవదానానికి సైతం ముందుకు రావాలని కోరుతున్నారు. అవయవ దానం చేసిన వారికి ప్రభుత్వం నుంచి ఆర్ధికసాయం అందించేందుకు కృషి చేస్తామని జీవన్ దాన్ ఇన్ఛార్జ్ డా. రాంబాబు తెలిపారు.
నాలుగేళ్ల పోరాటం: కొద్ది సంవత్సరాల క్రితం ఏడవ తరగతి చదువుతున్న ఓ బాలుడు అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లాడు. కిడ్నీ చెడిపోయిందని, దానిని ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. ఆ చిన్నారి మనోధైర్యంతో నాలుగేళ్ల పాటు డయాలసిస్ చేయించుకుంటూ కష్టపడి చదువుకున్నాడు. ఏడాదిన్నర క్రితం బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి కిడ్నీని జీవన్ దాన్ ద్వారా ఆ బాలునికి అమర్చారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని, అవయవదానం గురించి పలువురికి అవగాహన కల్పిస్తున్నానని ఆ బాలుడు అంటున్నాడు.