Officials Report on Tirupati Stampede Incident: తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడుకు తిరుపతి జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించారు. డీఎస్పీ అత్యుత్సాహం కారణంగా ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని నివేదికలో పేర్కొన్నారు.
వాహనం పార్క్ చేసి వెళ్లిపోయిన అంబులెన్స్ డ్రైవర్:తొక్కిసలాట జరిగిన కూడా డీఎస్పీ సరిగా స్పందించలేదని, వెంటనే ఎస్పీ సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి భక్తులకు సాయం చేశారని రిపోర్టులో తెలిపారు. అంబులెన్స్ వాహనాన్ని టోకెన్ కౌంటర్ బయట పార్క్ చేసి డ్రైవర్ వెళ్లిపోయాడని, 20 నిమిషాల పాటు అతడు అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు. డీఎస్పీ, అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే భక్తులు చనిపోయారని నివేదికలో కలెక్టర్ వెల్లడించారు. మరోవైపు డీఎస్పీ తీరుపై ఎస్పీ సుబ్బారాయుడు, ఇతర అధికారుల నుంచి సైతం వివరాలు సేకరించి కలెక్టర్ ఈ నివేదిక అందించారు.
డీఎస్పీ అత్యుత్సాహం వల్లే తొక్కిసలాట:మరోవైపు ఇప్పటికే ఈ ఘటనపై టీటీడీ ఈవో సైతం స్పందించారు. టీటీడీ ఈవో శ్యామలరావు కూడా డీఎస్పీ వల్లే ఘటన జరిగిందని తెలిపారు. డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే తొక్కిసలాట జరిగినట్లు ప్రాథమికంగా తెలిసిందని టీటీడీ ఈవో పేర్కొన్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని అన్నారు.
కాగా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో పలు సెంటర్ల వద్ద సర్వదర్శనం టోకెన్ల జారీకి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ టోకెన్ల కోసం భక్తులు పెద్ద ఎత్తున కేంద్రాల వద్దకు రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.