Officials Re-survey in Sajjala Estate :వైఎస్సార్ జిల్లా సీకేదిన్నె మండలంలోని సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన ఎస్టేట్లో అధికారుల బృందం రీ-సర్వే కొనసాగిస్తోంది. సజ్జల కుటుంబ సభ్యులకు సంబంధించిన 146 ఎకరాల పట్టా భూమిలో 55 ఎకరాల అటవి భూమి ఆక్రమించారని అభియోగాలపై అధికారులు సర్వే చేస్తున్నారు. కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, సీకేదిన్నే తహశీల్దార్ నాగేశ్వరరావు, బద్వేలు సబ్ డీఎఫ్ఓ స్వామి వివేకానంద, ల్యాండ్ సర్వేయర్ ఏడీ మురళీకృష్ణ అధికారుల బృందం సర్వే చేసింది.
55 ఎకరాల అటవి భూమి ఎక్కడెక్కడ ఉంది అనే దానిపై సరిహద్దులు గుర్తిస్తున్నారు. శుక్రవారం సర్వే చేసి కొంతవరకు హద్దులు గుర్తించిన అధికారులు, ఇవాళ మళ్లీ సర్వే కొనసాగించారు. మరో రెండు రోజులపాటు సజ్జల ఎస్టేట్లో సర్వే కొనసాగుతుందని అధికారులు తెలిపారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం 55 ఎకరాల అటవీ భూమిని వైఎస్సార్సీపీ నేత సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించారని తేలడంతో అధికారుల బృందం ప్రస్తుతం సర్వే కొనసాగిస్తుంది. సర్వే పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.
సజ్జల ఎస్టేట్లో అటవీ భూములు :వైఎస్సార్ జిల్లా సీకే దిన్నె మండలంలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన సజ్జల ఎస్టేట్లో పదుల సంఖ్యలో అటవీ భూములు ఆక్రమించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేటు, డీకేటీ పట్టా భూములు కూడా కబ్జా చేసినట్లు బాధితులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. సజ్జల దివాకర్ రెడ్డి, సజ్జల జనార్ధన్ రెడ్డి, సజ్జల సందీప్ రెడ్డి కుటుంబ సభ్యుల పేరుతో 146 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ జరిగింది. వీటిలో సజ్జల సందీప్ రెడ్డి పేరిట 71.49 ఎకరాలు, సజ్జల జనార్ధన్ రెడ్డి పేరిట 18.85 ఎకరాలు, నర్రెడ్డి బాగిరెడ్డి పేరిట 19.22 ఎకరాలు, వై. సత్య సందీప్ రెడ్డి పేరిట 21.46 ఎకరాలు, సజ్జల విజయకుమారి పేరిట 7.30 ఎకరాలు ఉంది. ఇంకా కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్ట్రేషన్ జరిగాయి.