Officials Instructions to Staff on Votes Counting Process:రాష్ట్రంలో జూన్ 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అధికారులు అప్రమత్తం అయ్యారు. లెక్కింపు ప్రక్రియపై ఎక్కడికక్కడ సమీక్షలు నిర్వహించి, లెక్కింపుపై సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు. వివాదాలు ఏర్పడే ప్రాంతాల్లో రెడ్ జోన్ ప్రకటించారు. కౌంటింగ్లో ఎక్కడా వివాదాలకు తావివ్వకుండా నిర్వహించాలని అధికారులు కౌంటింగ్ సిబ్బందికి సూచిస్తున్నారు.
Visakha District:విశాఖ జిల్లాకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో జరగనున్న నేపథ్యంలో దాదాపు 2 వేల మంది పోలీసులతో భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. లెక్కింపులో ప్రతి అంశాన్ని ఆర్వోలకు కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చిన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మల్లికార్జున తెలిపారు. ఓట్ల కౌంటింగ్ సమయంలో 12 వందల మంది సిబ్బంది పాల్గొంటారని చెప్పారు. ఇప్పటికే అక్కడ ఉన్న స్ట్రాంగ్ రూంలలో ఈవీఎంలను కేంద్ర బలగాల మధ్య భద్రపరిచిన్నట్లు వివరించారు. పోస్టల్ బ్యాలెట్‌లతో కలిపి 72 శాతం పైగా ఓట్లు పోలయ్యాయని తెలిపారు. అత్యధికంగా భీమిలి నియోజకవర్గంలో 25 రౌండ్లు, అతి తక్కువగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో 17 రౌండ్లు కౌంటింగ్ జరుగుతుందన్నారు.
Vizianagaram District:విజయనగరం జిల్లాలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్లు కౌంటింగ్ కోసం లెండి ఇంజినీరింగ్ కళాశాలలో, జేఎన్టీయూలో ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఓట్ల లెక్కించడానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. జూన్ 6 వరకు ఎటువంటి ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదన్నారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా ప్రతీఒక్కరూ సహకరించాలని కలెక్టర్ నాగలక్ష్మి కోరారు.
Anantapur District:అనంతపురం జేఎన్టీయూ పరిసర ప్రాంతంలో మూడు కిలోమీటర్ల మేర పోలీసులు రెడ్ జోన్ ప్రకటించారు. జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో పోలీసు బలగాలతో భారీ కవాతు నిర్వహించారు. సెక్షన్ 144, 30యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ గౌతమీశాలి వెల్లడించారు. 8 నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎం, వీవీ ప్యాడ్‌లను జేఎన్టీయూ స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.
మూడంచల భద్రత ఏర్పాటు:ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి సాలి చెప్పారు. అనంతపురం నగరంలో పోలీస్ ఫోర్సుతో కలిసి ఫ్లాగ్ మార్చి నిర్వహించిన ఎస్పీ గౌతమి, జిల్లాలోని 315 సున్నితమైన ప్రాంతాల్లో భద్రత చర్యలు తీసుకున్నామన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద మూడంచల భద్రత ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ నుంచి కోర్టు రోడ్డు, రామనగర్ మీదుగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.