Illegal Constructions in Rajahmundry :చారిత్రక నగరం రాజమహేంద్రవరంలో ఆక్రమణలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. రహదారులు, కాలువలు ఇలా కాదేదీ కబ్జాకు అనర్హం అంటూ గత వైఎస్సార్సీపీ హయాంలో చెలరేగిపోయారు. సుందరీకరణ పేరిట రూ.కోట్లు కుమ్మరించి నాసిరకం పనులు చేసేందుకు మొగ్గు చూపారే కానీ ప్రజల కనీస అవసరాలు తీర్చేందుకు నాడు ఏ చర్యలు లేవు.
ఇటీవల ఉక్కుపాదం మోపుతూ :మూలగొయ్యి నుంచి కోటిలింగాల ఘాట్‌కు వెళ్లేందుకు గతంలో 20 అడుగుల రోడ్డు ఉండేది. ఆక్రమణలకు గురై ఐదడుగులకు కుంచించుకుపోయింది. దీంతో కారు వెళ్లేందుకు సైతం అవకాశం లేదు. ఇటీవల పర్యటించిన కమిషనర్ ఆక్రమణల తొలగింపునకు నిర్ణయించారు. దీ మదన్‌సింగ్‌పేటలో రోడ్డు, కాలువలపై నిర్మాణాలు చేపట్టగా అధికారులు తొలగించారు.
మూడు బృందాల నియామకం :50 డివిజన్ల పరిధిలోని 21 ప్రాధాన ప్రాంతాల్లో 128 అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించారు. 8 కిలోమీటర్ల మేర కాలువలు ఆక్రమణలకు గురయ్యాయి. రోడ్లపై వాణిజ్య, వ్యాపార సముదాయాలు నిర్మించేశారు. వీటిని తొలగించేందుకు పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, పోలీసులతో కూడిన మూడు బృందాలు ఉంటాయి. ఒక్కో బృందంలో 13 మందిని నియమించారు. రోజుకు 48 చోట్ల ఆక్రమణలు తొలగించనున్నారు.
నేతల అండదండలతో : వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో అధికారులపై తీవ్ర ఒత్తిడి పెట్టారు. నాయకుల చేతులు తడిపితే చాలు పట్టణ ప్రణాళికా విభాగం నుంచి అనుమతులు వచ్చేసేలా వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకున్నారు. వ్యాపార, వాణిజ్య కూడళ్లలో ప్రభుత్వ స్థలాలు, రోడ్లు, కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. మెయిన్ రోడ్డు, కోటగుమ్మం, నల్లమందు సందు, దేవీచౌక్, కోటిపల్లి బస్టాండ్, దానవాయిపేట, గుండువారి వీధి, తాడితోట, కంబాలచెరువు, ప్రకాశంనగర్‌లో దుకాణాల నిర్మాణానికి డబ్బులు చేతులు మారాయి. అనుమతులకు మంజూరుతో పాటు అదనపు అంతస్తు కోసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు ఆ పార్టీ నేతలు వసూలు చేశారు.