ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఊపిరి పీల్చుకుంటున్న అధికారులు, నేతలు - నిన్నటి వరకు కాల్స్‌లో మాట్లాడాలన్నా భయమే - Officers and leaders got Freedom - OFFICERS AND LEADERS GOT FREEDOM

Officers and Leaders Got Freedom in AP: కర్ఫ్యూతో లభించే శాంతి శ్మశానపు ప్రశాంతిని తలిపిస్తుందని ఓ మహానుబావుడు చెప్పిన మాట! ఐదేళ్లుగా భయం గుప్పెట్లో ఉంటూ జగన్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా తమ అభిప్రాయం చెప్పడానికే హడలిపోయిన అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నేతలు ఇప్పుడు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఫోన్లను ఇష్టారాజ్యంగా ట్యాప్‌ చేశారనే ఆందోళనలు వెల్లువెత్తాయి. దాంతో 2 రోజుల కిందటి వరకు ఫోన్‌ చేసినా పలకరించని అధికారులు ఇప్పుడు తమంతట తామే కాల్‌ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు జగన్‌ అధికారాన్ని కోల్పోవడంతో ఒక్కసారిగా స్వేచ్ఛ లభించిన ఆనందం నిజంగానే అన్ని వర్గాల్లోనూ కన్పిస్తోంది.

Officers and Leaders Got Freedom in AP
Officers and Leaders Got Freedom in AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 6, 2024, 7:20 AM IST

ఊపిరి పీల్చుకుంటున్న అధికారులు, నేతలు - నిన్నటి వరకు కాల్స్‌లో మాట్లాడాలన్నా భయమే (ETV Bharat)

Officers and Leaders Got Freedom in AP: వైఎస్సార్సీపీ పాలనలో ఏదైనా సమావేశంలో నలుగురు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు కలిసినా పొడిపొడిగానే మాట్లాడుకునేవారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరుతున్న తరుణంలో అరాచక ప్రభుత్వ హయాంలో ఎవరెవరి ఫోన్లు ట్యాప్‌ చేశారు? అందుకు బాధ్యులెవరు? ఎక్కడ నుంచి ట్యాపింగ్‌ జరిగిందనే కోణంలో దర్యాప్తు చేయించాలని డిమాండ్లు వివిధ వర్గాల నుంచి వస్తున్నాయి. ఏపీ హైకోర్టులోని న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్‌ చేశారనే ఆరోపణలు వచ్చాయి.

ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతో ఐపీఎస్‌ అధికారి సారథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్‌ చేశారని, దీనిపై సీబీఐ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ చేయించాలని కోరుతూ 2020లో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో కొందరు పోలీసు అధికారులు అరెస్టై జైలుకు వెళ్లారు. న్యాయమూర్తుల ఫోన్‌లను ట్యాప్‌ చేశారంటూ పత్రికల్లో వచ్చిన వార్తలను అక్కడి హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణకు స్వీకరించింది.

'ముఖ్యమైన దస్త్రాలను ప్రాసెస్ చేయొద్దు- నిధుల విడుదల నిలిపేయండి' - Revenue Department orders

రాష్ట్రంలో ప్రభుత్వం మారినందున వైఎస్సార్సీపీ అనుకూల అధికారుల్లో కలవరం మొదలైంది. ఇందులో భాగంగానే ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేశారనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ మాదిరే ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందంటూ వైఎస్సార్సీపీ నుంచి ఇటీవలే తెదేపాలో చేరిన మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ తాజాగా ఆరోపించారు. ఇంటెలిజెన్స్‌ విభాగాధిపతి ఆధ్వర్యంలో తమ ఫోన్లు ట్యాప్‌ చేశారని గతంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కూడా ఆరోపించారు.

వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక నెలా, రెండు నెలల పాటు అధికారులు స్వేచ్ఛగా మాట్లాడినా తర్వాత మీరు ఫలానా వారితో ఎందుకు మాట్లాడుతున్నారనే ప్రశ్నలు పెద్దల నుంచి వచ్చాయి. దీంతో తమ ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారనే అనుమానాలు అధికారులు అందర్నీ వెంటాడాయి. అప్పటి నుంచి ఉన్నతాధికారులు తరచూ ఫోన్లు మార్చారు. ఆర్థికంగా తట్టుకోగలిగిన వారైతే 15 రోజులు, నెల, రెండు నెలలకో ఫోన్‌ మార్చారు.

ట్యాపింగ్‌ మాత్రమే కాదు, ఫోన్‌లో మాల్‌వేర్‌ చొప్పించి యాప్‌లను సైతం ఇన్‌స్టాల్‌ చేసి, మైక్రోఫోన్‌ ద్వారా సంభాషణలు వింటున్నారనే అనుమానాలు కూడా అధికారుల్లో ఉండేవి. అందుకే ఎవరైనా తమను కలిసేందుకు వచ్చినా, ఫోన్‌లను దూరంగా ఉన్న గదిలో పెట్టి రావాలంటూ చెప్పేవారు. తన ఫోన్‌లో నుంచి ఏమైనా రికార్డు చేయొచ్చనే భయంతో దాన్నీ సోఫా సందుల్లో కుక్కేసేవారు. తరచూ ఫోన్లను ఫార్మాట్‌ చేసే విధానమూ నేర్చుకున్నారు.

మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకున్న జీఏడీ- ఐటీ విభాగంలో సోదాలు - AP Secretariat

వైఎస్సార్సీపీ హయాంలో ఉద్యోగ సంఘాలు, ప్రజాసంఘాల నేతలనూ పోలీసులు వెంటాడారు. ఆంగన్వాడీ, ఆశ, సీపీఎస్‌ ఉద్యోగ సంఘాల నేతలు ఎవరైనా తాము చేయాలనుకున్న ధర్నాల గురించి ఫోన్లలో మాట్లాడుకుంటే వెంటనే పోలీసులు అక్కడ వాలిపోయేవారు. ఫోన్‌ ట్యాపింగ్‌ లేకుంటే ఇంత పక్కాగా సమాచారం ఎలా తెలుస్తుందని వారు ప్రశ్నించారు. వీటన్నింటికి సమాధానం చెప్పకుండా వారిని అణగదొక్కారు. ఫోన్లు ట్యాప్‌ కాకుండా చూసుకోవడానికి ఉన్నతాధికారులు తొలుత సాధారణ కాల్స్‌ నుంచి వాట్సప్‌కు మారారు.

తర్వాత అదీ సురక్షితం కాదని తెలిసి సిగ్నల్‌ యాప్‌లోకి వెళ్లారు. టెలిగ్రామ్‌ ద్వారా కొన్నాళ్లు కాల్‌ చేసి మాట్లాడారు. ఐఫోన్‌ కొనుక్కుని ఫేస్‌టైమ్‌ వినియోగించారు. ఇలా ఎన్ని చేసినా ట్యాపింగ్‌ను తప్పించుకోవడం కష్టమేనని తెలుసుకుని ఫోన్‌కు దూరంగా ఉండటమే అలవాటు చేసుకున్నారు. ఇంట్లో కుటుంబసభ్యులతో వ్యక్తిగత విషయాలు మాట్లాడే సమయంలోనూ ఫోన్‌ను పక్కగదిలో దూరంగా పెట్టేసి వచ్చేంత దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నారు. కొందరైతే ఏడాదికి 10 వేల రూపాయలు ఖర్చు చేసి ఐటీ సంస్థలు సమాచార భద్రతకు ఉపయోగించే వీపీఎన్‌ విధానంలోకి మారారు.

ఫోన్‌ ట్యాపింగ్‌పై అధికారికంగా ఎక్కడా ఆధారాలు దొరక్కుండా కొన్ని ప్రైవేటు సంస్థలకు ఈ బాధ్యతలను అప్పగించి వారి ద్వారా వ్యవహారం చక్కబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడ నుంచి ట్యాప్‌ చేసినా, ఎవరు చేయించినా ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ కాలంలో వెలికితీయడం అసాధ్యమేమీ కాదు. కొత్త ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి, సమగ్ర విచారణకు ఆదేశించాలని రాజకీయ నాయకులు, అధికారులు డిమాండ్‌ చేస్తున్నారు.

సచివాలయం ఐటీ విభాగంలో పోలీసుల తనిఖీలు - Police Chekings in the Secretariat

ABOUT THE AUTHOR

...view details