Officer Corruption in Agricultural Department in AP :ఆంధ్రప్రదేశ్ అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి పేషీలో ఆయనో కీలక అధికారి. కార్యాలయానికి ఎవరు, ఏ పనిపై వచ్చినా సాయంత్రం ఆయన ఇంటికి వెళ్లాల్సిందే. అక్కడ సంకేతాలు అలా ఉంటాయి మరి. అక్కడికి వచ్చాక పని పూర్తి కావాలంటే ఎంత ఖర్చవుతుందో ఓ నంబర్ అంటుంది. పోస్టింగ్ కావాలన్నా, పదోన్నతి కల్పించాలన్నా, ప్రతి పైరవీకి అతని దగ్గర ఓ లెక్క ఉంటుంది. అది నిబంధనలకు అతీతంగా ఉన్నా సరే, అతను చెప్పిన లెక్కకకు సరిపోలిన లెక్క చెప్పితే చాలు. మళ్లీ దాని వంక చూడాల్సిన పని లేదు సుమి.
సస్పెండైన వారైనా, కేసుల్లో ఉన్న వారైనా వారు అడిగింతా సమర్పించుకుంటే సరే ముందుకు కదులుతుంది లేదంటే మంత్రి సంతకమైనా వారాలు, నెలలు తరబడి నిలిచిపోతుంది. అక్కడికి వచ్చింది ఎవరు, పనేంటి అన్నది లెక్కకాదు, సాయంత్రానికి ఎంత కలెక్షన్ అన్నదే ముఖ్యం. మరి ఇంత చేస్తున్న ఆయన రోజువారీ వసూళ్లు రూ. 20లక్షలకు పైమాటే. ఇంతటి అవినీతి సేద్యం చేస్తున్న ఆ అధికారి తీరు చూసి వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు తెల్లబోసుకున్నారు. ఇంతటి దోపిడీని దేనితోనూ పోల్చి చూడలేమని వాపోతున్నారు.
ఆయన పేరు చెబితే భయపడుతున్న అధికారులు : ఈ అధికారి వైఎస్సార్సీపీ హయాంలోను ఓ మంత్రి వద్ద పనిచేశారు. అప్పట్లో కూడా ఇతనిపై ఆరోపణలు వచ్చాయి. అయినా ఏరికోరి మరీ ప్రత్యేకంగా ఆ అధికారినే పేషీలో నియమించుకోవడం గమనించాల్సి విషయం. ఆయన పేరు చెబితే వ్యవసాయ, అనుబంధ శాఖల ఉన్నతాధికారులే కాక కిందిస్థాయి ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు, వివిధ పనులపై వచ్చే కంపెనీల ప్రతినిధులు జంకుతున్నారు.
ఈ అధికారి వ్యవసాయ శాఖలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే వారిని కూడా వదలడంలేదు. జీతాల విడుదలకు సంబంధించిన ఫైల్ కదల్చడానికి చిరుద్యోగులు తమ కష్టార్జితాన్ని సమర్పించుకోవాల్సిందే. మూడునెలల కిందట పశు సంవర్ధక శాఖలో పదోన్నతులు కల్పించగా ఇందులోనూ భారీగా మూటజెప్పుకున్నారు. సహకార శాఖలోనూ పదోన్నతుల్లో అధికారికి ముడుపులు అందాయి.
ఆయిల్‌పామ్ సాగుకు సంబంధించి కంపెనీలకు మండలాల కేటాయింపుల్లోనూ చేతివాటం ప్రదర్శించారు. మత్స్య శాఖ పరిధిలోని జలాశయాల్లో చేపపిల్లలు వదిలేందుకు టెండర్లు పిలిచి పనులు అప్పగించాలని అధికారులు నిర్ణయించగా పక్కన పెట్టి కొటేషన్ పద్ధతిలో పనులు అప్పజెప్పారు. ఇందులోనూ పెద్దమొత్తంలో చేతులు మారాయనే ఆరోపణలున్నాయి.