Suraksha Committees in NTR District : పోలీసింగ్‌ని బలోపేతం చేసేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. పోలీసింగ్‌లో ప్రజలను భాగస్వాములను చేస్తూ సాంకేతికతను ఉపయోగించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రణాళికలు రూపొందించారు. సమాజంలోని వివిధ వర్గాల ప్రతినిధులతో జిల్లాలోని ప్రతి స్టేషన్ పరిధిలో సురక్ష కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ నెల 22 నుంచి కమ్యూనిటీ పోలీసింగ్‌కు శ్రీకారం చుట్టనున్నారు.
పోలీసింగ్‌ని పటిష్ఠ పరిచేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయవాడ కమిషనరేట్‌లో సురక్ష పేరుతో సీపీ రాజశేఖర బాబు ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి స్టేషన్ పరిధిలో పోలీసులు, ప్రజల మధ్య మరింత మెరుగైన సమన్వయం కోసం సురక్ష కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఒక ఉపాధ్యాయుడు, వైద్యుడు, ఎన్ఆర్ఐ, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఔత్సాహిక పారిశ్రామికవేత్త, వర్తక సంఘాల నుంచి ఒకరు, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరు సహా మొత్తం 20 మంది సభ్యులు ఉంటారు.
ఈ కమిటీలు సమాజంలోని అణగారిన వర్గాల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించనున్నాయి. పౌరులకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను గుర్తించి వాటిని మెరుగు పరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించనున్నాయి. కమిషనరేట్ పరిధిలోని పోలీసింగ్ కార్యక్రమాల్లో సమాజ భాగస్వామ్యాన్ని పెంచడంలో కమిటీ సభ్యులు వారధులుగా వ్యవహరిస్తారు. ప్రజలకు పోలీసులు అందిస్తున్న సేవలపై అభిప్రాయాలు సేకరించి మరింత మెరుగ్గా అందించేందుకు సూచనలు ఇవ్వనున్నారు.