AP New Liquor Policy :ఏపీలో నూతన మద్యం విధానానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవాళ సాయంత్రం లేదా మంగళవారం ఉదయం విడుదలయ్యే అవకాశం ఉంది. మద్యం రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేట్‌కు అప్పగించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఫారిన్ లిక్కర్ చట్టానికి సవరణలు చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సంతకం చేసి ఆమోదం తెలిపారు.
ఈ ఆర్డినెన్స్ దస్త్రం గవర్నర్ కార్యాలయం నుంచి న్యాయశాఖకు చేరింది. ఆ శాఖ దీనికి సంబంధించి గెజిట్‌లో నోటిఫికేషన్‌ను ఇవాళ ప్రచురించనుంది. ఈ చట్టబద్ధమైన ప్రక్రియ పూర్తయిన వెంటనే నూతన మద్యం విధానం విధివిధానాలు, అర్జీల స్వీకరణ, లాటరీ తీసి లైసెన్సుదారులను ఎంపిక చేసే తేదీల వివరాలతో ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులను విడుదల చేయనుంది. అక్టోబర్ 10, 11 తేదీల నాటికి లైసెన్సుల జారీ ప్రక్రియ పూర్తి చేసేయాలని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. ఆ వెంటనే కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి.
2019 జూన్ కంటే ముందు ఆంధ్రప్రదేశ్‌లో మద్యం రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేట్ వ్యాపారులే నిర్వహించేవారు. సర్కార్ వారికి లైసెన్సులు జారీ చేసేది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక మొత్తం రిటైల్ వ్యాపారాన్ని రాష్ట ప్రభుత్వం తరఫున ఏపీఎస్‌బీసీఎల్ లేదా ఇతర ప్రభుత్వ కార్పొరేషన్ ఏదైనా మాత్రమే నిర్వహించేలా చట్టాన్ని మార్చేశారు. ఈ క్రమంలోనే ప్రైవేట్ వ్యాపారానికి చట్ట ప్రకారం అవకాశం లేకుండా చేశారు.