Normal Conditions In Vijayawada : విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో జనజీవనం కుదుటపడుతోంది. కండ్రిక, అంబాపురం, జక్కంపూడిలోని కొన్ని లోతట్టు ప్రాంతాలు మినహా నగరమంతటా ఇళ్లు, దుకాణ సముదాయాలు పూర్తిగా వరద నీటి నుంచి బయటకొచ్చేశాయి. పది రోజులకు పైగా వరద నిల్వ ఉండటంతో ఇళ్లు దెబ్బతిన్నాయి. అగ్నిమాపకశకటాలు వెళ్లేందుకు వీలుపడని చిన్న చిన్న వీధుల్లో ఇంటి యజమానులే తమ గృహాలను శుభ్రం చేసుకుంటున్నారు. ఇంట్లో సామాన్లేవీ పనికొచ్చేలా లేవనే ఆవేదనే అంతటా వినిపిస్తోంది.
ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాల్లో తడిసి పాడైన సామగ్రిని బాధితులు బయట తెచ్చి పడేస్తున్నారు. రహదారుల పక్కన అవే కుప్పలుగా పోగవుతున్నాయి. పారిశుద్ధ్య కార్మికులు వాటిని తొలగిస్తున్నారు. ప్రభుత్వ సహాయ చర్యలపై వరద బాధితుల నుంచి సంతృప్తి వ్యక్తం అవుతోంది. చిరు వ్యాపారులు, దుకాణదారులు తడిసిన సామాగ్రిని ఆరబెట్టుకుంటున్నారు. జరిగిన నష్టాన్ని తలుచుకుని కుమిలిపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం నిరీక్షిస్తున్నారు. ఇళ్ల గోడలు బీటలు బారాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ దీన పరిస్థితిని చెప్తూ ఓ మహిళ కంటతడి పెట్టుకుంది.
'జీవితాన్ని మళ్లీ జీరో నుంచి ప్రారంభించాలి. మాకు మిగిలిందేమీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవడం గొప్ప విషయం. ఇదే విధంగా జరిగిన ఆస్తి నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని సహాయం చేస్తే బాగుంటుంది. సర్టిఫికెట్లు కూడా నీళ్లలో తడిసిపోయాయి. ఒక్కటని కాదు అన్ని షాపుల్లో నీరు చేరి లక్షల విలువచేసే సామాగ్రి వరదపాలైంది.- వరద బాధితులు