No Quality on Godavari Yetigatlu in West Godavari :సరిగ్గా రెండేళ్ల క్రితం గోదావరికి వచ్చిన వరదలతో నరసాపురం వద్ద ఏటిగట్లు భారీగా కోతకు గురయ్యాయి. జనావాసాల్లోకి నీళ్లు చేరి నరసాపురం పట్టణ ప్రజలకు 2 వారాల పాటు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. కోట్లు ఖర్చు చేసి గట్టు పటిష్ఠతను చేపట్టినా ప్రస్తుత వరదల నేపథ్యంలో వాటి నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. కోతకు గురైన ప్రాంతంలోనే గట్టును పటిష్ఠం చేయగా బలహీనంగా ఉన్న చోట్ల పనులు చేయలేదు. ఫలితంగా మరోసారి తీర ప్రాంత వాసులను వరద భయం వెంటాడుతోంది.
ప్రశ్నార్థకంగా ఏటిగట్ల పటిష్ఠత : గోదావరి ఏటి గట్లు ఏటికేడు బలహీనంగా మారుతున్నాయి. నిర్వహణ లోపాలకు తోడు గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గట్ల పటిష్ఠత గాలిలో దీపంలా మారింది. 2022 జులైలో వచ్చిన వరదలకు నరసాపురం పొన్నపల్లి వద్ద ఉన్న గోదావరి ఏటిగట్టు 400 మీటర్ల మేర కోతకు గురైంది. అప్పట్లో 50 లక్షల రూపాయలు వెచ్చించి తాత్కాలికంగా గట్లకు ఇసుక బస్తాలు, కర్రలు పెట్టి అడ్డుకట్ట వేశారు. 2022 నవంబర్‌లో రూ.28 కోట్లు ఖర్చుపెట్టి కోతకు గురైన గట్టును పటిష్ఠపరిచే పనులు చేపట్టారు. 100 మీటర్ల మేర గట్టును బండరాళ్లతో పూడ్చారు. మళ్లీ ఈ ఏడాది జనవరిలోనూ గట్టు కుంగిపోగా అప్పటి నుంచి పటిష్ఠం చేస్తూ వచ్చారు.
గోదావరి మహోగ్రరూపం - విలవిల్లాడుతున్న లంక గ్రామాలు - Godavari Floods in AP
కోతకు గురైన చోటే పనులు : గట్లను సర్వే చేసి బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పటిష్ఠం చేయాల్సి ఉండగా కేవలం కోతకు గురైన చోటే పనులు చేయడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. రివిట్‌మెంట్‌పై దృష్టి పెట్టకుండా భారీ బండరాళ్లను వేసి వదిలేశారు. దీంతో రాళ్లకు మధ్య ఉన్న ఖాళీ ప్రదేశం నుంచి నీరు ప్రవహించి మరోసారి గట్టు కోతకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం గోదావరికి వరదలు కొనసాగుతున్న తరుణంలో ఏటిగట్లు మరోసారి భయాందోళనకు గురిచేస్తున్నాయి.